
పలు అంశాలపై కేబినేట్ కీలక నిర్ణయాలు
హైదరాబాద్, అక్టోబర్ 24 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నవంబర్ 5 నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర కేబినేట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఇవాళ సాయంత్రం రెండు గంటలకుపైగా సుధీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత కేబినెట్ తీసుకున్న నిర్ణయాల ప్రస్తుత పరిస్థితులపై కూడా కేబినెట్ సవిూక్ష జరిపింది. బడ్జెట్‌కు సంబంధించిన పలు ప్రతిపాదనలపై కూడా కేబినెట్‌లో చర్చించినట్టు సమాచారం. కేబినేట్ సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. నవంబరు 5 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. భూదాన్ బోర్డు రద్దు చేయనున్నారు. అలాగే భూదాన్ బాధ్యత సీసీఎల్‌ఏకు అప్పగిస్తారు. రూ.50కోట్లతో రాష్ట్ర అత్యవసర నిధి ఏర్పాటు చేయనున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ స్టాటిస్టికల్స్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. రిజిస్ట్రేషన్ యాక్టు సవరణను ఆమోదించారు. పోలీసుశాఖ ఆధునీకరణకు నిధులు విడుదల చేస్తారు. గ్రీన్‌హౌజ్ కల్టివేషన్ కింద వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్‌ల నిర్మాణం కోసం రూ.252కోట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. మూడు ఎకరాల్లో పాలీహౌజ్ నిర్మాణం కోసం ప్రతి రైతుకు 75% సబ్సిడీ ఇవ్వనున్నారు. సూక్ష్మసాగు కింద బిందు, తుంపర సేద్యం కొరకు రూ.300కోట్లు కేటాయించారు. ఈ సేద్యంలో ఎస్‌సి, ఎస్‌టి రైతులకు 100%, చిన్న, సన్నకారు రైతులకు 90%, ఇతరులకు 80% సబ్సిడీ ఇస్తారు. విజయ డైరీకి పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4రూపాయలు అదనంగా ఇచ్చేందకు కేబినేట్ ఆమోదం తెలిపింది.




