Tuesday, 3 November 2026

ఓటింగ్‌ జరిగితే 50 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు


తెలంగాణకు అనుకూలం
సమైక్యవాదులకు నార్కో టెస్ట్‌లు జరపాలి
రెబల్‌ అభ్యర్థుల వెనుక ఓ చాంపియన్‌ : మంత్రి డొక్కా
హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి):
తెలంగాణ బిల్లుకు 50 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతారని రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. నిజమైన సమైక్యవాదులు ఎవరో తేలాలంటే సీఎం కిరణ్‌ సహా అందరికీ నార్కో టెస్టు చేయాలని మంత్రి అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే 50 మంది సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెలంగాణపై పార్టీ నిర్ణయానికి కట్టుబడతారని పేర్కొన్నారు. రాజ్యసభ రెబల్‌ అభ్యర్థుల వెనుక ఓ అదశ్య శక్తి పని చేస్తోందని మంత్రి డొక్కా అనుమానం వ్యక్తం చేశారు. ఆ అదృశ్య శక్తి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన చాంపియన్‌గా భావిస్తున్నామన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం కాదని ఆయన చెప్పారు. సీఎం కిరణ్‌పై మంత్రి ఈ పరోక్ష వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల వెనుక సీమాంధ్ర ముఖ్య నాయకుడి అదృశ్య శక్తి ఉందని చేసిన ఆరోపణలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ అదృశ్య శక్తికి ఇష్టం లేకుంటే పార్టీ నుండి వెళ్లి పోవచ్చునని హితవు పలికారు. రాజ్యసభ ఎన్నికల్లో అదృశ్య శక్తి ప్రోత్సహిస్తున్న అభ్యర్థులను తాము ఓడిస్తామన్నారు. సమైక్యాంధ్ర పేరుతో ప్రజలకు భ్రమలు కల్పిస్తూ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి డొక్కా వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. రెబల్‌ అభ్యర్థుల వెనక అదృశ్యశక్తి ఉందన్న ఆయన వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది. అది ఎవరన్నదానిపై అనుమానాలు వెల్లడవుతున్నాయి. ఆయన సిఎంను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశారా అన్నది అందరూ అనుమానిస్తున్నారు. ఇదిలావుంటే ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని కాంగ్రెస్‌ తిరుగుబాటు రాజ్యసభ అభ్యర్థులు తెలిపారు. తమ నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు కాంగ్రెస్‌ అన్నీ విధాల ప్రయత్నాలు చేసిందన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా రాజ్యసభకు నామినేషన్‌ వేసిన ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, చైతన్య రాజుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. తమ నామినేషన్లు ఆమోదయోగ్యం పొందడం సంతోషకరమని అన్నారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా న్యాయం గెలిచిందన్నారు. రెండు రోజులుగా మమ్మల్ని, తమకు మధ్ధతు పలికిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ నిద్రపోనివ్వలేదని, తమ నామినేషన్లకు ప్రతిపాదించిన సభ్యులను కాంగ్రెస్‌ బెదిరించిందని ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఆరోపించారు. తమకు 60మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని, కాంగ్రెస్‌ ఎంత బెదిరించినా మా వెంటే ఉన్న సభ్యులందరికీ మా హృదయపూర్వక వందనాలు అని మరో రెబల్‌ అభ్యర్ధి చైతన్యరాజు తెలిపారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని చైతన్యరాజు చెప్పారు. ఎన్నికలలో తాము తప్పనిసరిగా గెలుస్తామని చెప్పారు. చాలామంది సమైక్యాంధ్రకు మద్దతుగా తమకు ఓటు వేస్తారన్నారు. తమకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు అన్నీ చదివాకే సంతకాలు చేశారన్నారు. రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ వ్యవహారంలో రాజ్యాంగేతర శక్తి పనిచేస్తోందని, అధికారులు చరిత్రలో లేని నిబంధనలు చెబుతున్నారని కాంగ్రెస్‌ మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మద్దతు చూపించనంత మాత్రాన నామినేషన్లను తిరస్కరించాలనే నిబంధన ఏమీ లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ తాము పార్టీలకతీతంగా ఆదాల, చైతన్య రాజులను రాజ్యసభ బరిలో నిలిపామని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలను మంత్రులు తమ కార్యాలయాల్లోనే నిర్బంధించినా తమకు న్యాయం జరిగిందన్నారు. సమైక్యవాదం వినిపించేందుకే తాము బరిలో నిలిచామన్నారు. పార్టీలకతీతంగా సమైక్యవాదం వినిపించాలనుకునే వారు తమకు మద్దతు ఇవ్వాలని జేసీ దివాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు పార్టీ కుయుక్తులు పన్నినా తమకు ఎన్నికల సంఘం న్యాయం చేసిందని చెప్పారు. కాగా, ఓ వైపు కాంగ్రెసు నేతలు చైతన్య రాజు, ఆదాలలకు మద్దతు ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తెచ్చినా జెసి దివాకర్‌ రెడ్డి రెబల్‌ వర్గానికి అండగా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *