
మరోసారి పొడిగించే అవకాశం లేనట్టే
బిల్లు ఢిల్లీకి పంపే ఏర్పాట్లలో స్పీకర్
హైదరాబాద్, జనవరి 29 (జనంసాక్షి) :
తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు గురువారం ముగుస్తోంది. చర్చకు మరో మూడు వారాల గడువు సీఎం కోరినప్పటికీ పొడిగించే అవకాశం మాత్రం కనిపించడం లేదు. బుధవారం చర్చ జరక్కుండానే రెండుసార్లు సభ వాయిదా పడింది. గురువారం మాత్రమే ఇక మిగిలి ఉండడంతో చర్చ జరుగుతుందా లేక స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది. గడువు ఇంకా పొడిగించాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రపతికి లేఖ రాశారు. రాష్ట్రపతి వారం రోజులు గడువు పొడిగించినప్పటికీ రెండు రోజులు మాత్రమే చర్చ సజావుగా సాగింది. బిల్లును వెనక్కి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యూహాత్మకంగా స్పీకర్‌కు నోటీసు ఇవ్వడంతో చర్చకు బ్రేక్ పడింది. దీంతో మరోమారు తెలంగాణ ముసాయిదా బిల్లుపై రాష్ట్రపతి గడువు పెంచే సూచనలు కనిపించటం లేదు. ఈ నెల 30 తర్వాత టీబిల్లు ఢిల్లీకి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ దిశగా ¬ంశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గడువు ముగిసిన మరుక్షణమే కార్యాచరణను మొదలు పెడుతున్నట్లు ¬ంశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సీఎం కిరణ్ నోటీసు ప్రకారం సభలో ఓటింగ్ పెట్టే అవకాశం లేనందున తాము అనుకున్నది చేసుకుపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో జరిగిన చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. అసెంబ్లీ నుంచి అధికారిక సమాచారం వచ్చే లోగానే తుది బిల్లుకు ఒక రూపం ఇవ్వాలని వారు భావిస్తున్నారు. సీఎం లేఖరాసినా బిల్లుపై చర్చకు గడువు పెంచే పరిస్థితి లేదని ¬ంశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గురువారం వరకూ సభ సజావుగా సాగకపోతే స్పీకర్ తాజా పరిస్థితులను వివరిస్తూ బిల్లును పంపే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన కార్యాలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రపతి గడువు పెంచకపోతే ఫిబ్రవరి 3న బిల్లును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా రాష్ట్రపతికి తిప్పిపంపనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన మలి విడత గడువు గురువారంతో ముగుస్తోంది. మొదట ఇచ్చిన గడువు మొన్న 23తోనే ముగిసినప్పటికీ, సీమాంధ్ర నేతల కోరిక మేరకు ఈనెల 30వరకు గడువు పొడిగించారు. సీఎం తీరుతో తెలంగాణ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇరుప్రాంతాల నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో మూడు రోజులుగా చర్చ జరగడం లేదు. చివరకు బీఏసీ సమావేశంలో సైతం ఏకాభిప్రాయం కుదరలేదు. ముసాయిదా బిల్లుపై చర్చ ముగిశాకే తీర్మానం గురించి ఆలోచించాలని డిప్యూటి సిఎం దామోదర రాజనర్సింహ చెబుతున్నారు. ముఖ్యమంత్రి నోటీసు వెనక్కి తీసుకుంటేనే చర్చకు సహకరిస్తామని టీఆర్‌ఎస్ స్పష్టం చేస్తుంది. బిల్లుపై మెజారిటీ సభ్యుల అభిప్రాయం తెలవాలంటే ఓటింగ్ పెట్టాలని టీడీపీ సభ్యులు కోరుతున్నారు. బిల్లును తిరిగిపంపాలంటూ తాను ఇచ్చిన నోటీస్ కారణంగానే చర్చకు ఆటంకం కలిగిందనే విషయం తెలిసినప్పటికీ, మరో మూడు వారాలు గడువు పొడిగించాలంటూ రాష్ట్రపతికి ముఖ్యమంత్రి లేఖ రాయడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. చివరిరోజు సభ జరిగినా, జరగకపోయినా నివేదిక పంపేందుకు స్పీకర్ కార్యాలయం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికి దాదాపు వంద మంది సభ్యులు సభలో అభిప్రాయాలు చెప్పగా, మరికొందరు స్పీకర్‌కు రాత పూర్వకంగా అభిప్రాయాలు తెలియజేశారు. ఒక్క చంద్రబాబునాయుడు మినహా అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలు కూడా ఇప్పటికే తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ క్రమంలో అందరికంటే ఆఖరులో మాట్లాడి తన ప్రసంగాన్ని హైలెట్ చేసుకోవాలని ముచ్చటపడ్డ చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టినట్లుగానే ఉంది.
నేటితో ముగియనున్న గడువు




