రోడ్ మ్యాప్‌పై టీ కాంగ్రెస్ కసరత్తు
హైదరాబాద్ మాదే
నీటిపై నిపుణులే తేలుస్తారు
దామోదర నివాసంలో సమావేశం
హైదరాబాద్, జూలై 7 (జనంసాక్షి) :
తెలంగాణపై రోడ్‌మ్యాప్ కోసం టీ కాంగ్రెస్ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఆదివారం మినిష్టర్ క్వార్టర్స్‌లోని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నివాసంలో భేటీ అయిన టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఎలాంటి రోడ్‌మ్యాప్ అధిష్టానం ముందుంచాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, బస్వరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, ఆమోస్ పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ, తెలంగాణపై ఎవరు సలహాలిచ్చినా స్వీకరిస్తామని అన్నారు. రెండు రోజుల పాటు నిపుణులు, మేధావులతో సమావేశమవుతామని, వారి సూచనలు, సలహాలు తీసుకుంటామని అన్నారు. ఢిల్లీ పెద్దల నుంచి ఎప్పుడు పిలుపువస్తే అప్పుడు ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ వెళ్లి నివేదిక అందజేస్తారని పేర్కొన్నారు. సోమ, మంగళవారాల్లో మంత్రి జానారెడ్డి నివాసంలో చర్చలు కొనసాగనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ఈ నెల 12వ తేదీన ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. అధిష్టానం నుంచి ఎప్పుడు పిలుపొచ్చినా రోడ్డు మ్యాప్ వివరాలను అందజేస్తామన్నారు. రోడ్డుమ్యాప్‌పై స్వచ్చందంగా వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని కోరారు. తెలంగాణ వాదులంతా తరలివచ్చి తమ తమ అభిప్రాయాలను తెలపాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, ముడిపడిన అంశాలతో నివేదిక రూపొందించనున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణపై తుది నిర్ణయమే తరువాయి అని, అధిష్టానం నిర్ణయం ఏదైనా.. అందరూ సహకరించాలని కోరుతున్నామని తెలిపారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నిర్ణయం తీసుకుంటామని చెప్పడమే తెలంగాణ ఏర్పాటుకు సంకేతమని అన్నారు. అందరి అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్టానానికి అందజేస్తామన్నారు. అంతకుముందు ఎంపీ రాజయ్య మీడియాతో మాట్లాడారు. అన్నదమ్ముల్లా విడిపోయి కలిసుందామని అన్నారు. పది జిల్లాలతో హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. రాయలతెలంగాణ ప్రతిపాదన అధిష్టానం దృష్టిలో లేదన్నారు. తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. సీిఎం కిరణ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన వారేనని, తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని ఆయన్ను కోరనున్నట్టు చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణ రోడ్‌మ్యాప్ రూపొందించాలని సిఎం, డిప్యూటి సిఎం, పిసిసి చీఫ్‌లను కోరిన విషయం తెలిసిందేనని అన్నారు. అదే విషయంపై ఈరోజు తామందరం సమావేశమయ్యామని అన్నారు. తెలంగాణపై రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. అధిష్టానం నుంచి ఎప్పుడు పిలుపువచ్చినా ఆ మ్యాప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కాంగ్రెస్ సమావేశానికి వచ్చిన ఓయూ జెఎసి నేత పిడమర్తి రవి మాట్లాడుతూ, ఇప్పటికైనా మాట తప్పొద్దని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నామన్నారు. తెలంగాణ వస్తుందన్న అభిప్రాయం కిందిస్థాయి వరకు చేరిందని అన్నారు. ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ గజ్జెల కాంతం మాట్లాడుతూ, తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే.. ఆ ప్రాంత ప్రజలందరూ కాంగ్రెస్ వెంటే ఉంటారని అన్నారు.