తరతరాల తండ్లాట తెలంగాణ కొట్లాట
కాంగ్రెస్ కోర్‌కమిటీ నిర్ణయం నేడే..
ఎదురు చూస్తున్న యావత్ దేశం
నిర్ణయానికి రాజ్యాంగ సవరణ అవసరం
ఇక నాన్చం.. తేల్చేస్తాం : దిగ్విజయ్
సమైక్యవాదుల దింపుడుకళ్లం ఆశ
రోడ్ మ్యాప్‌లతో కిరణ్, బొత్స, దామోదర ఢిల్లీలో..
న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల తరతరాల తండ్లాటపై, ఆ తండాట్లను సాకారం చేసుకునేందుకు నాలుగున్నర దశాబ్దాలుగా సాగిస్తున్న కొట్లాటపై ఒక నిర్ణయం వెలువడే సమయం ఆసన్నమైంది. తెలంగాణపై కాంగ్రెస్ కోర్‌కమిటీ నిర్ణయానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ అంశం నిర్ణయాత్మక దశకు వచ్చింది. తెలంగాణ అంశంపై మరికొన్ని గంటల్లో కీలక భేటీ జరగనుంది. కొన్ని కోట్ల మంది అత్యంత ఉత్కంఠ, ఆసక్తితో ఎదురుచూస్తున్న సమావేశానికి గడువు సమీపించింది. ఏం జరుగుతుంది? ఎలాంటి నిర్ణయం వెలువడనుంది? అని యావత్ రాష్ట్రమే కాదు దేశమే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శుక్రవారం జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీలో తెలంగాణ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుండడంతో అటు హస్తినలో, ఇటు రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర దశ, దిశను నిర్ణయించే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇప్పటికే రోడ్‌మ్యాప్ రూపొందించారు. మరిన్ని సంప్రదింపులు, చర్చల అనంతరం తుది నివేదకకు మెరుగులు దిద్దనున్నారు. ఇదిలా ఉంటే, హస్తినలో రాష్ట్ర నేతల హడావుడి నెలకొంది. ఇటు తెలంగాణ నేతలు, అటు సీమాంధ్ర నేతలు వరుస భేటీలతో హల్చల్ చేశారు. కీలక నిర్ణయం వెలువడనున్న తరుణంలో అనుకూల నిర్ణయం కోసం లాబీయింగ్‌ను ముమ్మరం చేశారు.
సీమాంధ్ర నేతల మంత్రాంగం
రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు సీమాంధ్ర నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరిన పలువురు సీమాంధ్ర మంత్రులు, నేతలు సమైక్య రాష్టాన్న్రి కొనసాగించాలని హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కాకుండా ప్యాకేజీలు ప్రకటిస్తే అభ్యంతరం లేదని లాబీయింగ్ చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచీ రాత్రి వరకూ వరుస సమావేశాలు, భేటీలతో హస్తినలో హల్చల్ చేశారు. మంత్రులు టీజీ వెంకటేశ్, శైలజానాథ్, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కనుమూరి బాపిరాజు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తదితరులు తొలుత ఏపీ భవన్లో సమావేశమయ్యారు. తెలంగాణను ఎలా అడ్డుకోవాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. అనంతరం ఎంపీ కేవీపీ రామచంద్రరావు నివాసంలో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. సుదీర్ఘ భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే పరిణామాలను ఆయనకు వివరించారు.
ఢిల్లీ చేరిన బొత్స, కిరణ్, దామోదర
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ గురువారం ఉదయం ఢిల్లీకి చేరారు. రాష్ట్ర విభజన అంశంపై బొత్స హైకమాండ్‌కు నివేదిక ఇవ్వనున్నారు. ఇరు ప్రాంతాలకు చెందిన నేతలతో సంప్రదింపులు జరిపిన పీసీసీ చీఫ్.. రోడ్‌మ్యాప్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే దాదాపు నివేదికను కొలిక్కి తీసుకువచ్చిన బొత్స.. చివరి నిమిషంలో కూడా పలు మార్పుచేర్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీలో ఉన్న రాష్ట్ర నేతలతో తుది విడత చర్చలు జరిపిన అనంతరం ఆయన రోడ్‌మ్యాప్‌కు తుదిరూపు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీకి వెళ్లే ముందు బొత్స పలువురు నేతలతో సమావేశమయ్యారు. ఉదయం మంత్రి జానారెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ అయి అభిప్రాయాలు సేకరించారు. అధిష్టానానికి ఇవ్వనున్న రోడ్‌మ్యాప్‌పై ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగినట్లు సమాచారం. జానా ఇంటికి వెళ్లి సమావేశమైన బొత్స జానా అభిప్రాయాలను కూడా బొత్స తన నివేదికలో పొందుపరచనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి షబ్బీర్ అలీతోనూ సమావేశమయ్యారు. భేటీ ముగిసిన అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని సీమాంధ్ర నేతలకు విజ్ఞప్తి చేశారు. రెండు రాష్టాల్రుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఆస్తులు, ప్రాణాలకు తాము వాచ్‌డాగ్‌లా ఉంటామన్నారు. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అన్నదమ్ముల్లా విడిపోదామని సూచించారు. కోర్ కమిటీలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. సీమాంధ్ర పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడి ¬దాలో తన అభిప్రాయాన్ని బొత్స చెప్పానన్నారు. ఇరు ప్రాంతాల అభిప్రాయాలను రోడ్‌మ్యాప్‌లో పొందుపరచాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షడిపై ఉందని తెలిపారు. సీఎం కిరణ్, డెప్యూటీ సీఎం దామోదర సైతం గురువారమే ఢిల్లీకి చేరుకున్నారు.
నేడు కోర్‌కమిటీ కీలక భేటీ
తెలంగాణపై కోర్ కమిటీ సమావేశం నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. శుక్రవారం జరిగే భేటీలో సోనియాతో పాటు ఆజాద్, దిగ్విజయ్ సింగ్, ఆంటోనీ కూడా పాల్గొంటారు. వీరు తీసుకునే నిర్ణయం కీలకంకాబోతున్నది. ఒకవేళ డిసెంబర్ 9 ప్రకటనకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్‌కు ఎదురేలేదు. అందుకు తగ్గట్లుగా ఢిల్లీలో, హైదరాబాద్‌లో హడావుడి మొదలైంది. రెండు ప్రాంతాలకు చెందిన మంత్రులు, ముఖ్య నాయకులు ఆయా ప్రాంత ప్రజల మనోభావాలను అగ్రనేతలకు గట్టిగా వినిపించారు. పోటాపోటీగా సమావేశమయ్యారు. కోర్ కమిటీ బేటీలో ఏం జరగబోతోందన్న అంశంపైనే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అతి కొద్దిమంది తప్ప దాదాపుగా మంత్రులంతా ఢిల్లీకి వెళ్లాలని, అవసరమైతే మరోసారి తమ వాదన వినిపించేందుకు అగ్రనేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఏర్పాటు మినహా మరో ప్రత్యామ్నాయం లేనే లేదని ఈ ప్రాంత మంత్రులు మరోసారి స్పష్టం చేయడంతో పాటు గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముగ్గురు మహిళా మంత్రులు డి.కె.అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏం చేసైనా విభజన యత్నాల్ని అడ్డుకోండి’ అని సీమాంధ్రకు చెందిన మంత్రులు సీఎం కిరణ్‌కి సూచించారు. ఢిల్లీలో కూడా వారు ఇదే వాదన వినిపించారు. మరోవైపుతెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోబోతోందని రాష్ట్రంలో విస్తృత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు మాత్రం దాన్ని ధ్రువీకరించడం లేదు. అలాగని సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉన్నట్లు కూడా చెప్పడం లేదు. హైకమాండ్‌లో ఏం జరుగుతోందో తమకు తెలియదని, దిగ్విజయ్‌సింగ్ నేరుగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో మాత్రమే మాట్లాడుకుంటున్నారని, మధ్యలో ఎవ్వరికీ ఏమీ తెలియడం లేదు. 12వ తేదీ కోర్ కమిటీ మీటింగ్‌లో కేవలం తెలంగాణ అంశంపైనే చర్చ ఉంటుందా? లేదంటే అజెండాలో మరిన్ని అంశాలు కూడా ఉంటాయా? అన్న దానిక్కూడా జవాబు లేదు. తెలంగాణపై తేల్చేస్తామన్న దిగ్విజయ్‌సింగ్ అంత వేగం కేంద్ర ¬ంమంత్రి షిండే మాటల్లో కనిపించడంలేదు. రాష్ట్ర విభజన అంశంపై అధికారికంగా నిర్ణయాలు ప్రకటించి, అమలుచేసే ¬ంమంత్రి ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. తెలంగాణ అంశానికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కనుక్కోవాలని రాహుల్‌గాంధీతో అన్నారని, అందుకే దిగ్విజయ్ సింగ్ దీనిపై హడావుడి చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు దిగ్విజయ్ గురువారం ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు రాజ్యాంగ సవరణ అవసరమని అన్నారు. అయితే ఎలాంటి సవరణ అవసరమో స్పష్టతమాత్రం ఇవ్వలేదు. తెలంగాణపై ఇకపై నాన్చబోమని, ఏది ఏమైనా తేల్చేస్తామని స్పష్టం చేశారు.