బిల్లు వాకిట తెలంగాణ

నోట్‌ రూపకల్పనలో హోం శాఖ
8న కేబినెట్‌ ప్రత్యేక భేటీ
అదే రోజు రాష్ట్రపతికి
వెనువెంటనే అసెంబ్లీకి
వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు
న్యూఢల్లీి, జూలై 31 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ లోక్‌సభలో బిల్లు ఎదుట నిలిచింది. ఈమేరకు అవసరమైన రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టేందుకు అవసరమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేబినెట్‌ నోట్‌ను తయారు చేయాలని ప్రధాని కార్యాలయం బుధవారం హోం శాఖను ఆదేశించింది. అనంతరం తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం చేయాలని రాష్టాన్న్రి కోరే అవకాశం ఉంది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో జరిగే మంత్రిమండలిలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ ఏర్పాటుతో పాటు ఉత్తరాఖండ్‌ వరద సాయంపై కేబినెట్‌ చర్చించనుంది. ఈ భేటీలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం లాంఛనప్రాయంగా ఆమోదం తెలుపనుంది. అనంతరం తెలంగాణ ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం చేయాలని రాష్ట్రాన్ని కోరనుంది. అసెంబ్లీ అభిప్రాయంతో పని లేకుండా కేంద్రం తదుపరి చర్యలు చేపట్టనుంది. బిల్లు ముసాయిదాకు కేబినెట్‌ ఆమోదముద్ర పడిన అనంతరం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు అవసరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభించింది. ఈ వర్షాకాల సమావేశాల్లో బిల్లు పార్లమెంట్‌కు రానుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ ధ్రువీకరించారు. వర్షాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని బుధవారం ప్రకటించారు.
త్వరలోనే అసెంబ్లీ సమావేశం
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు కాంగ్రెస్‌లో అత్యున్నక నిర్ణాయక మండలి వర్కింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసేందుకు యూపీఏ, సీడబ్ల్యూసీ సమావేశం అంగీకరించాయి. పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. అలాగే, హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రతిపాదించింది. ఈ మేరకు అవసరమైన ప్రక్రియను చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి మండలి సమావేశమై రాష్ట్ర ఏర్పాటుకు లాంఛనంగా ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణలకు స్పష్టమైన సమాచారం అందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై శాసనసభ, శాసనమండలిలో చర్చించి, తీర్మానం చేయనున్నారు. అసెంబ్లీలో తీర్మానం ఓడినా, గెలిచినా దానితో సంబంధం లేకుండా కేంద్రం తదుపరి చర్యలు చేపడుతుంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు, ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ప్రచార బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. ఆ పార్టీ మరింత బలపడేందుకు అవకాశం ఇవ్వకుండా వీలైనంత తొందరగా ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. తన ముందున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకొంటు ముందుకు వెళ్తోంది. రాష్ట్రపతి పాలనలో ఉన్న జార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ కాలంగా పెండిరగ్‌లో ఉన్న తెలంగాణ అంశాన్ని తాజాగా తేల్చేసింది. ఆగస్టు మొదటి వారంలో హైదరాబాద్‌లో మోడీ సభ ఉండడం, ఈ సభలో తెలంగాణపై ఆయన కచ్చితంగా కాంగ్రెస్‌ను ఏకిపడేసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆ అవకాశమివ్వకుండా ముందుగానే నిర్ణయం ప్రకటించేసింది.