
జగన్, విజయసాయితో సహా శ్రీనివాసన్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (జనంసాక్షి) :
జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు తుది అంకానికి చేరింది. ఇప్పటికే నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మంగళవారం మరో మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇండియా సిమెంట్స్, భారతి సిమెంట్స్, పెన్నా సిమెంట్ కంపెనీలపై పలు అభియోగాలు మోపింది. ఆయా చార్జిషీట్లలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజసాయిరెడ్డిను ప్రధాన నిందితులుగా, మిగతా ఏడుగురిని నిందితులుగా పేర్కొంది. ఇండియా సిమెంట్స్ జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులన్నీ ముడుపులేనని పేర్కొంది. ఈ మేరకు గగన్‌విహార్‌లోని ప్రత్యేక న్యాయస్థానం ఎదుట చార్జిషీట్లు దాఖలు చేసింది. నాంపల్లి సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందున సీబీఐ ఈ చార్జిషీట్లను గగన్‌విహార్‌లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. జగన్ కేసులకు సంబధించి సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థకు ఇచ్చిన గడువు ఈ నెల 8వ తేదీతో ముగిసింది. అయితే, ఎనిమిది, తొమ్మిది తేదీలు వరుసగా సెలవులు రావడంతో సీబీఐ అధికారులు మంగళవారం చార్జిషీట్లు దాఖలు చేశారు. ఇండియా సిమెంట్స్ యజమాని శ్రీనివాసన్‌ను కూడా సీబీఐ నిందితుడిగా చేర్చింది.
అవన్నీ ముడుపులే..
ఇండియా సిమెంట్స్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, కార్మెల్ ఏసియాలలో రూ.140 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ మొత్తం అంతా ముడుపులేనని సీబీఐ దర్యాప్తులో తేల్చింది. వైఎస్ ప్రభుత్వం నుంచి మేళ్లు పొందినందుకు ప్రతిఫలంగా ఇండియా సిమెంట్స్ ఈ పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది. కాగ్నా నదీజలాల వినియోగానికి ఇండియా సిమెంట్స్‌కు వైఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు ప్రతిఫలంగానే ఆ సంస్థ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని సీబీఐ అభియోగాలు మోపింది. ఇక పెన్నా సిమెంట్స్ జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఎసియాలలో రూ.68 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇవి కూడా ముడుపులేనని సీబీఐ పేర్కొంది. కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో సున్నపురాయి గనులను వైఎస్ ప్రభుత్వం పెన్నా సిమెంట్స్‌కు అప్పగించింది. అనంతపురం జిల్లాలో 230 ఎకరాల భూమిని కేటాయించింది. అలాగే, కడప జిల్లాలో 475 ఎకరాల సున్నపురాయి గనులను భారతి సిమెంట్స్‌కు బదిలీ చేస్తూ నాటి ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో రఘురాం సిమెంట్స్ నుంచి భారతి సిమెంట్స్‌కు 475 ఎకరాల బదిలీ అక్రమమని సీబీఐ తేల్చింది. భారతి సిమెంట్స్ సేకరించిన 120 ఎకరాలకు వివిధ రకాల మినహాయింపులు ఇచ్చిందని, ఇందులో అక్రమాలు జరిగాయని పేర్కొంది. భారతి సిమెంట్స్‌లో నిమ్మగడ్డ ప్రసాద్ రూ.244 కోట్లు, దాల్మియా సిమెంట్స్ రూ.95 కోట్లు పెట్టుబడులు పెట్టారు.
పొన్నాలకు క్లీన్‌చిట్
జగన్ అక్రమాస్తుల కేసులో పలుమార్లు విచారణ ఎదుర్కొన్న మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ఊరట లభించింది. అక్రమాస్తుల కేసుతో పొన్నాలకు ప్రమేయం లేదని సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. పొన్నాల మంత్రిగా ఉన్న సమయంలోనే ఇండియా సిమెంట్స్‌కు కాగ్నా నదీ జలాల కేటాయింపు జరిగింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు పలుమార్లు పొన్నాలను విచారించారు. అయితే, ఈ కేసులో పొన్నాలకు ఎలాంటి ప్రమేయం స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే జగన్ ఆస్తుల కేసులో ముగ్గురు మంత్రులు చిక్కుకోగా పొన్నాలకు మాత్రం క్లీన్‌చిట్ లభించడం విశేషం. జగన్ కేసులో మోపిదేవి వెంకటరమణ అరెస్టు అయి జైలులో ఉండగా, ధర్మాన ప్రసాదరావు, సబితాఇంద్రారెడ్డి పలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేసు వల్ల ఈ ముగ్గురు తమ పదవులు కోల్పోవాల్సి వచ్చింది.
జగన్ కేసులో చార్జిషీట్లు




