Wednesday, 4 November 2026

తెరుచుకున్న కేదార్‌నాథ్‌ తలుపులు


ప్రారంభమైన పూజలు
కేదార్‌నాథ్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) :
భారీ వరద బీభత్సంతో కేదార్‌నాథ్‌ ఆలయంలో ఆగిపోయిన పూజలు తిరిగి ప్రారంభమయ్యా యి. 86 రోజుల అనం తరం కేదార్‌నాథ్‌ ఆల యంలో పూజలు మళ్లీ మొదలయ్యాయి. ప్రకృతి విపత్తు కారణంగా 86 రోజుల అనంతరం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ జ్యోతిర్లింగ క్షేత్రంలో బుధవారం ఉదయం నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులు చేరుకునేందుకు రోడ్డు మార్గం అనువుగా లేకపోవడంతో వాయు మార్గం ద్వారా భక్తులను అనుమతించాలని ఆలయ కమిటీ భావిస్తోంది. కేదార్‌నాథ్‌ ఆలయ సవిూపంలో ఇప్పటికే హెలిప్యాడ్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. కానీ ఇంకా డీజీసీఏ అనుమతి లభించలేదు. ఈనెల 30న ఆలయ కమిటీ, ప్రభుత్వం సమావేశమై దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. 24మంది పురోహితుల బృందం ఆలయ కమిటీ- సమక్షంలో పూజలు చేసేందుకు కేదార్‌నాథ్‌ చేరుకున్నారు. కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయ కమిటీ, అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం కేదార్‌నాథ్‌లో వాతావరణం ప్రశాంతంగా ఉండడంతో పూజలు ప్రారంభించేందుకు ఆలయ కమిటీ  అధికారులు సిద్ధమయ్యారు. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయ తలుపులను 86రోజుల తర్వాత తీశారు. పురోహితుడు రావల్‌ భీమా శంకర్‌ లింగ్‌ శివాచార్య పూజా కార్యక్రమాలను పున:ప్రారంభించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.  పూజా కార్యక్రమాలను చిత్రీకరించేందుకు బయల్దేరిన కొందరు విూడియా ప్రతినిధులు వాతావరణం అనుకూలించకపోవడంతో గుప్తకాశీలోనే ఆగిపోయారు. శుద్ధికరణ్‌, ప్రయాచిత్తీకరణ్‌లతో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రధాన పురోహితుడితో పాటు కొందరు తీర్థ్‌ పురోహితులు, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయ కమిటీ  అధికారులు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆలయ దర్శనకు భక్తులను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 30న జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో జూన్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా చాలా మంది భక్తులు మృతిచెందారు. రుదప్రయాగ, ఉత్తరకాశీ, చమోలి, పిత్తోర్‌గఢ్‌ జిల్లాల్లో సుమారు 600మంది చనిపోగా 4వేల మంది భక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *