
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బొత్స పిలుపు
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (జనంసాక్షి) :
ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను విరివిగా వాడుకోవాలని పీసీసీ అధ్య క్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు సూ చించారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పథకాలపై విరివిగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో సోషల్ మీడియాపై పార్టీ శ్రేణులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నియోజకవర్గాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అవగాహన సదస్సును ప్రారంభించిన బొత్స వారిని ఉద్దేశించి ప్రసంగించారు. సోషల్ మీడియా ఆవశ్యకతను ఆయన ఈ సందర్భంగా వివరించారు. సోషల్ మీడియాపై అందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకొనేందుకు సోషల్ మీడియాను విరివిగా వినియోగించుకోవాలని సత్తిబాబు సూచించారు. విపక్షాలు, ప్రత్యర్థులు చేసే ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను వేదికగా ఉపయోగించుకోవాలన్నారు. పార్టీ, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అసలైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నారు. పథకాల అమలులో ఎక్కడైనా లోపాలు, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తాము ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని, సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సోషల్ మీడియా ద్వారా అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులకు కొంత సమాచార లోపం ఉందని.. సామాజిక విూడియా ద్వారా దాన్ని సరి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం నాయకత్వం నుంచి వెళ్తున్న సమాచారం క్షేత్ర స్థాయికి వెళ్లడం లేదని, దీన్ని అధిగమించేందుకు, పైనుంచి కిందివరకు సమాచారం వెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఐటీ వినియోగాన్ని పార్టీ నేతలు గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాల్లో ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొట్టేందుకు సమాచారాన్ని అప్పటికప్పుడు గాంధీభవన్ నుంచి పంపేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియాను వినియోగించుకోండి




