
ఉరే సరి.. జాలి చూపొద్దన్న ప్రాసిక్యూషన్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 (జనంసాక్షి) :
యావత్ భారతావని ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నిర్భయ కేసులో నిందితులకు శిక్షల ఖరారు శుక్రవారానికి వాయిదా పడింది. శిక్షల ఖరారుపై బుధవారం ఢిల్లీలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. గతేడాది నవంబర్ 16న ఢిల్లీ నడివీధుల్లో ‘నిర్భయ’ దారణ అఘాయిత్యానికి బలైంది. బస్సులో తిప్పుతూ ఆమెపై ఆరుగురు దుండగులు కిరాతకంగా అకృత్యానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమె డిసెంబర్ 29న సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనపై దేశం మొత్తం కదిలిరావడంతో కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. తొమ్మిది నెలల పాటు విచారణ జరిగింది. ఆరుగురు నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరో మైనర్ బాలుడికి మూడేళ్ల శిక్ష పడింది. మిగతా నలుగురిని దోషులుగా గుర్తిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. అత్యాచారం, హత్య, అపహరణ, దోపిడీ, సాక్షాలను రూపుమాపడం, అసహజ నేరాలు వంటి 13 అభియోగాల్లో నలుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు.. వారికి శిక్షల ఖరారుపై బుధవారం విచారణ చేపట్టింది. వాదనలు పూర్తి కావడంతో నిందితులైన ముఖేశ్, పవన్‌గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లకు ఢిల్లీ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా శుక్రవారం శిక్షలు ఖరారు చేయనున్నారు. బుధవారం శిక్షల ఖరారుకు నిందితులను కోర్టుకు తీసుకువచ్చారు. విచారణ ప్రారంభం కాగానే నిందితుల్లో ఒకడైన ముఖేశ్.. ¬ం మంత్రి షిండే కోర్టు ధిక్కారణ కేసు పెట్టాలని న్యాయమూర్తిని కోరాడు. తమపై కోర్టు శిక్షలు ఖరారు చేయకముందే ¬ం మంత్రి షిండే ఉరిశిక్ష వేస్తారంటూ ప్రటకనలు చేశారని ఓ లేఖ అందజేశాడు. తర్వాత కొద్దిసేపటికే నిందితుడు తన లేఖను వెనక్కు తీసుకున్నాడు. అంతకుముందు ఓ నిందితుడు తాను నిర్దోషినని కోర్టు హాలులో గట్టిగా అరిచాడు. దోషులకు ఉరిశిక్ష విధించాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాన్ కృష్ణ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వారు అత్యంత అరుదైన రీతిలో దారుణ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. ఉరిశిక్ష ఒక్కటే వారికి సరైనదని పేర్కొన్నారు. కాగా, నిందితులకు ఉరిశిక్ష కాకుండా జీవిత ఖైదు విధించాలని డిపెన్స్ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. నేరం జరిగిన సమయానికి నిందితుడు ముఖేశ్ వయస్సు 19 ఏళ్ల లోపేనని, అందువల్ల చట్టాలను పునఃసవిూక్షించాలని కోరారు. మీడియా సమాజాన్ని ప్రభావితం చేసిందని, దోషుల పట్ల జాలి చూపి, మరణ దండడ నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉరిశిక్ష విధించడం ప్రాథమిక హక్కులకు భంగమని పుట్టుకతోనే ఎవరూ నేరస్తులు కారన్న సుప్రీం వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదే సమయంలో తాము నిర్దోషులమని నలుగురు నిందితులు కోర్టు హాలులో నినాదాలు చేశారు. అయితే, ఆయన వాదనను ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. నిందితుల పట్ల ఎలాంటి జాలి చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అసహాయకురాలైన ఓ యువతి పట్ల అత్యంత క్రూరంగా, హేయంగా వ్యవహరించిన నలుగురు దోషులకు ఉరిశిక్ష వేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దోషులకు గరిష్టస్థాయి శిక్ష వేయాలని, వారికి మరణ దండన విధించడమే సరైనదని పేర్కొన్నారు. ఇరువురి వాదనలను విన్న న్యాయస్థానం శుక్రవారం శిక్షలు ఖరారు చేయనుంది.
నిర్భయ కేసులో శిక్ష ఖరారు వాయిదా




