నవశకం నవ తెలంగాణ నిర్మిస్తాం
అన్ని రంగాల్లో సీమాంధ్రులదే ఆధిపత్యం
ఇగ సమన్యాయమేడుంటది : కోదండరామ్
కానిస్టేబుల్ జై తెలంగాణ అంటే తప్పా
కిరణ్ జై సమైక్యాంధ్ర అంటే ఒప్పా
తెలంగాణకు కోతలు పెడితే సహించం : హరీశ్
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (జనంసాక్షి) :
అన్ని రంగాల్లో సీమాంధ్రులే ఉంటే సమన్యాయం ఎలా అవుతుందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశ్నించారు. రాజకీయ, వ్యాపార, వాణిజ్య రం గాల్లో సీమాంధ్రులదే ఆధిపత్యం కొనసాతోందని విమర్శించారు. ఒక్క సినిమాలు, మీడియానే కాదు వ్యవస్థలన్నీ సీమాంధ్రుల చేతిలోనే ఉన్నాయని మండిపడ్డారు. చివరకు పాఠ్యపుస్తకాన్ని ఎవరు రాయాలో నిర్ణయించేది వారేనని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో వారే ఉంటే మన సమస్యలు ఎలా పరిష్కా రమవుతాయని ప్రశ్నించారు. అందుకే యావత్ తెలంగాణ ఆత్మగౌరవం, స్వయం పాలన కోరుకుంటోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాడే సమస్యల నుంచి, వివక్ష నుంచి, ఆధిపత్యం నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందని చెప్పారు. గురువారం తెలంగాణ న్యాయవాదుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బీజేఆర్ ప్రభుత్వ కళాశాలలో ‘తెలంగాణ-పునర్నిర్మాణం’ అంశంపై నిర్వహించిన సదస్సులో కోదండరామ్ ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షకు, నిర్లక్ష్యానికి, నిలువు దోపిడీకి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతోందని చెప్పారు. ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో లక్ష్యం దగ్గరకు వచ్చామని త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అమాయకపు తెలంగాణ వధువుకు, మోసగాడైన సీమాంధ్ర వరుడితో బలవంతపు పెళ్లి జరిపించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణను ఏర్పాటు చేసి అప్పటి తన తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి ఉద్యమాన్ని వీడే ప్రసక్తే లేదని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు పోరుబాటలో ఉంటామని స్పష్టం చేశారు. నవ తెలంగాణను నిర్మించుకుందామని, అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో కొనసాగుదామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో పది శాతం ఉన్నవారే రాజధాని తమది అంటే తొంబై శాతం ఉన్న తమ ప్రాంత ప్రజలు ఏమనాలని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లోని ప్రతి బంజారాహిల్స్లా మారాలని ఆకాంక్షించారు. ఒక్క పీవీ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం ఆపితే హైదరాబాద్‌లో మంచినీటి సమస్య తీరిపోయేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా గుప్పెడు మంది దోపిడీదారులకే నష్టం తప్పితే సీమాంధ్ర ప్రజలకు కాదన్నారు. సచివాలయంలో తెలంగాణ వాళ్లు డ్రైవర్లు, లిఫ్టు ఆపరేటర్లుగా ఉన్ఆనరని.. 80 శాతం మంది సీమాంధ్రులే సచివాలయంలో ఉద్యోగులుగా ఉన్నారన్నారు. కష్టమంతా తెలంగాణ వాళ్లదైతే.. ఆదాయం మాత్రం సీమాంధ్రులకా? అని ప్రశ్నించారు. హెరిటేజ్ పాలతో తెలంగాన పాలవ్యాపారుల పొట్ట కొట్టారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్లు ఉండరని, అందరూ ప్రభుత్వ లెక్చరర్లే ఉంటరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రకటించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాలకు తెలంగాణలో తావు లేదన్నారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులగానే ఉంటారన్నారు. గురువారం నగరంలో బీజేఆర్ ప్రభుత్వ కాలేజీలో తెలంగాణ పునర్ నిర్మాణంపై తెలంగాణ లెక్చరర్ల ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన సెమినర్‌లో ఆయన మాట్లాడారు. వచ్చే తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్‌గా గుర్తిస్తామాని హరీశ్ తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేవిధంగా చూస్తామన్నారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం పేరుతో ఆర్టీసీ బస్సులను బంద్ పెట్టి మూడు వేల ప్రైవేట్ బస్సులను నడిపిస్తూ, సీమాంధ్రలో ఉన్న ఆర్టీసీ పేద కార్మికులను నిలువునా ముంచుతున్నారని హరీష్ష్రావు ఆరోపించారు. సీమాంధ్రలోని ప్రతి జిల్లాకోక యూనివర్సిటీ ఉన్నదని, తెలంగాణలో యూనివర్సిటీల కొరతతో ఉస్మానియాలోని 60 సీట్ల కోసం నాలుగు జిల్లాల్లోని 500 పైగా కాలేజీల విద్యార్థులు పోటీపడే స్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం పూర్తిగా పెట్టుబడిదారులకు మద్దతుగా కొనసాగుతోంది. మానవీయ విలువలు లేకుండా ఉద్యమం చేస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పేదలకు సరకులు అందించే చౌధరల దుకాణాలు బంద్ చేశారని, చంద్రబాబు హెరిటేజ్ ఆగిందా అని ప్రశ్నించారు. లాంకో రాజగోపాల్ విద్యుత్ కేంద్రం, టిజి వెంకటేశ్ పరిశ్రమలు, మంత్రి గంటా పరిశ్రమలు ఎందుకు ఆగలేదన్నారు. పేద విద్యార్థులు ఉండే సంక్షేమ వసతిగృహాలు, పాఠశాల, కళాశాలలు మూయిస్తున్నారు. కార్పొరేటు విద్యా సంస్థలైన నారాయణ, చైతన్య, హాస్టల్లు బందు పాటించాయా అని నిలదీశారు. పేదప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులను ఆపేస్తున్నారని జేసీ దివాకర్‌రెడ్డి, ఇతర పెట్టుబడిదారులకు చెందిన కాళేశ్వర, ఎస్వీఆర్, కేశినేని ట్రావెల్స్ బస్సులు రెట్టింపు రేట్లతో ప్రయాణికులను తరలిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేటు వైద్యశాలలు ఎందుకు మూయించడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం పేద ప్రజల పక్షాన కొనసాగిందన్నారు. లగడపాటి ల్యాంకో హిల్స్ ఆగిందా చంద్రబాబు హెరిటేజ్ నడవడంలేదా టీజీ వెంకటేశ్ పరిశ్రమలు మూతపడ్డయా… చిరంజీవి వారసుల సినిమాలు ఆడడం లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే తెలంగౄణకు విద్యుత్ కోతలతో రైతలును దెబ్బతీస్తే తెలంగాణ ప్రజానీకం క్షమించదన్నారు. విద్యుత్ ఉద్యోగులు ల్యాంకోపైన, సీమాంధ్రా పెత్తందారులకు వ్యతిరేకంగా సమ్మె చేయాలన్నారు.సీమాధ్రలో సమ్మెతో తమకు అబ్యంతరం లేదని, అక్కడ విద్యుత్ మూసేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే అక్కడి సమ్మెతో ఇక్కడ కోతలు పెడితే సహించబోమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పేదలు, సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. కానీ ఇందుకు భిన్నంగా సీమాంధ్ర ఉద్యమం పెత్తందార్ల కోసం జరుగుతోందన్నారు. కానిస్టేబుళ్లు జై తెలంగాణ అంటే తప్పేంటని నిలదీశారు. జై తెలంగాణ అంటే తప్పయితే జై సమైక్యాంధ్ర అన్నా తప్పే అవుతుందన్నారు. కానిస్టేబుల్‌ను ఉద్యోగం తొలగించాలని చూస్తే ఊరుకోబోమన్నారు. అలా చేస్తే ముందుగా సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని తొలగించాలన్నారు. మీకో న్యాయం, తెలంగాణకో న్యామా అని ప్రశ్నించారు. పయ్యావుల కేశవ్, మైసురారెడ్డి సమైక్య సభ సందర్భంగా జరిగిన ఘటనలు ఖండిస్తున్నామంటున్నారే తప్ప అదే సభలో తెలంగాణ కాస్టేబుళ్లు శ్రీనివాస్, శ్రీశైలం, విద్యార్థి బాలరాజుపై జరిగిన దాడులను ఎందుకు ఖండించడంలేదని ధ్యజమెత్తారు. వైకాపా నాయకురాలు షర్మిలకు ఇవి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఒకే కన్ను కనిపిస్తోందా అని ఎద్దేవా చేశారు. కలిసుండాలంటూనే తెలంగాణ గన్మెన్లను సీమాంధ్ర మంత్రులు వెనక్కి పంపి వారిని అవమానపరిచారన్నారు.