
ప్రాంతాలుగానే విడిపోతం
మనసులు కలిసే ఉంటయి : సర్వే
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ కేవలం రెండు రాష్ట్రాలుగానే విడిపోతుందని, ఆ తర్వాత కూడా మానసికంగా, భౌతికంగా ఒక్కరిగానే ఉంటామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంచ తీరుతున్న సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డంకులు సృష్టించొద్దని సీమాంధ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తెలుగువారు ఢిల్లీలో, మహారాష్ట్రలో, మద్రాస్‌లో, కేరళలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో సైతం జీవిస్తునే ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికి ఎప్పటికి కూడా తెలుగువారిగానే కలిసి ఉంటామన్నారు. తెలుగువారంతా కలిసి మెలిసి ఉండాలన్నదే తన ప్రధాన ఉద్దేశ్యమన్నారు. తెలంగాణ ఏర్పడినంత మాత్రాన ఏదేదో జరిగిపోతుందని ఊహించుకోవద్దన్నారు. తెలంగాణ ప్రజలకిచ్చిన మాట ప్రకారమే కేంద్రం, సోనియాగాంధీ రాష్ట్రం ఏర్పాటు చేస్తోందన్నారు. 55 ఏళ్లుగా ఈ సమస్య ప్రజలను తీవ్రంగా వేదిస్తున్నదని, దీనిని పరిష్కరించిన సోనియాకు తెలంగాణ ప్రజలే కాదు తెలుగు వారంతా దన్యవాదాలు చెప్పాల్సిందేనన్నారు. తెలంగాణ వారిని రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని కోరారు. విభజన తర్వాత ఏఒక్కరు కూడా హైదరాబాద్‌నుంచే కాదు తెలంగాణాలోని అన్ని జిల్లాల నుంచి వెళ్లిపోవాల్సినవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఏర్పడిందని, కేవలం నీళ్లు, నిధులు, విద్య, వైద్యం తదితరాలు పంపకం జరుగాల్సి ఉందన్నారు. సీమాంధ్రులు సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌ను మానుకుని వారి ప్రాంతం అభివృద్దికి కావాల్సిన డిమాండ్లను కేంద్రం ముందు పెట్టాలని సత్యనారాయణ హితవు పలికారు. సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడం ఏఒక్కరికి మంచిది కాదన్నారు.
తెలంగాణకు హైదరాబాదే రాజధాని




