
ఇన్సూరెన్స్ నిక్షేప వ్యవస్థను ప్రారంభించిన చిదంబరం
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (జనంసాక్షి) :
బీమా సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) బీమా నిక్షేప వ్యవస్థను సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షిప్తం చేసేందుకు ఐఆర్‌డీఏ ఈ వ్యవస్థను రూపొందించింది. సోమవారం హైదరాబాద్‌లోని నొవాటెల్‌లో జరిగిన కార్యక్రమంలో చిదంబరం దీన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో జీవిత బీమా కానీ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా డిజిటలైజ్ చేయనున్నట్లు చెప్పారు. అంతకుముందు ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలోని టాటా, లాకిడ్ మార్టిన్ కంపె నీలను చిదంబరం సందర్శించారు. టాటా సెజ్‌లో ఏర్పాటు చేసిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టం లిమిటెడ్, లాకిన్ మార్టిన్ సంస్థలో తయారయ్యే హెలికాప్టర్ విడిభాగాలను పరిశీలించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చిదంబరం సోమవారం ఉదయం నగరానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణం కోసం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. నోవాటెల్ ¬టల్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ ప్రకటన, ఢిల్లీ పరిణామాలపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. అలాగే, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైనా సీఎం చిదంబరానికి వివరించినట్లు సమాచారం.
బీమా ఒకే గొడుగు కిందకు




