
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు : సీపీ
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనంసాక్షి) :
గణేశ్ నిమజ్జనోత్సవానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వేలాది మంది పోలీసులను నగరానికి పిలిపించారు. గణెళిశ్ నిమజ్జనాలకు మొత్తం 15 వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లను వివరించారు. 15 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రధాన కూడళ్లలో ఎనిమిది వందల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా 32 బాంబుస్క్వాడ్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. నిమజ్జనోత్సవాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పౌరులకు ఇబ్బందులు కలుగకండా అన్ని చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు. పాత రౌడీషీటర్లపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ వద్ద 71 క్రేన్లు ఏర్పాటు చేశామని వివరించారు. 155 మంది ప్రత్యేక స్థాయి అధికారులు నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. నగర పోలీసు బలగాలతో పాటు 175 ఏపీఎస్పీ బలగాలు, 32 బాంబుస్క్వాడ్ బృందాలు, 25 డాగ్‌స్క్వాడ్ బృందాలు నిరంతరం పహరా కాస్తుంటాయన్నారు. నిమజ్జనం ఊరేగింపు సాగే ప్రధాన మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామని వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ ప్రయాణ మార్గాలను మార్చుకోవాలని సూచించారు.
గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు




