Wednesday, 4 November 2026

వెనక్కు వెళ్తే యుద్ధమే


మంద కృష్ణమాదిగ
సోనియా మాటిస్తే వెనక్కిపోదు : సర్వే
హైదరాబాద్‌ యూటీ మహా ఉద్యమం : ఓయూ జేఏసీ
ఉస్మానియా క్యాంపస్‌లో యుద్ధభేరీ సభ విజయవంతం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గితే ఊరుకునేది లేదని, యుద్ధం చేసైనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ‘విద్యార్థి యుద్ధభేరి’ సభ జరిగింది. ఆయన మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. రాష్ట్ర సాధనలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకే యుద్ధభేరి సభను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతుందని, వివక్షతలన్నీ తొలగిపోతాయని అన్నారు. తెలంగాణ వెనకబాటుతనానికి గ్రామాల్లో నెలకొన్న దుర్భర పరిస్థితులే నిదర్శమని చెప్పారు. మూడు ప్రాంతాల్లో ఎమ్మార్పీఎస్‌ బలంగా ఉందని తెలిపారు. కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్‌ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణనే మనం కోరుకుందామన్నారు. సోనియాగాంధీ ఒకసారి మాటిస్తే వెనక్కిపోయే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌కు నష్టం జరగదని సోనియాకు వివరించినట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని తెలంగాణ ప్రజలకు మాటిచ్చామని సోనియా చెప్పారని తెలిపారు. ఓయూ జేఏసీ నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని చూస్తే ఊరుకోబమని, మహా ఉద్యమం చేసి హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఆటపాటలతో హోరెత్తించారు. విద్యార్థులు, నాయకులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలిరావడంతో యూనివర్సిటీ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వివేక్‌, టీిఎన్‌జీఓస్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ గౌడ్‌, గాయకుడు రసమయి బాలకిషన్‌, ఐకాస నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *