Tuesday, 3 November 2026

తెలంగాణపై అసెంబ్లీ నోట్‌ రెడీ


ప్రధాని రాకకోసమే ఎదురుచూపు
భద్రాచలం తెలంగాణలో అరతర్భాగమే
తానీషా కాలం నుంచి నిజాం స్టేట్‌లోనే : దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) :
తెలంగాణపై అసెంబ్లీ నోట్‌ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వ్యతిరేకంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం అవేవి పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చెయ్యాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ తిరిగి రాగానే అక్టోబర్‌ 3న లేదా 5వ తేదీన తెలంగాణపై డ్రాప్ట్‌ నోట్‌ను హోంమంత్రి షిండే కేంద్ర మంత్రివర్గం ముందుంచే అవకాశలున్నాయి. ఇక హైదరాబాద్‌ విషయంలో కేంద్ర హోంశాఖ మూడు నాలుగు ఐచ్ఛికాలను సూచించవచ్చనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, హైదరాబాద్‌ను తెలంగాణలో అంతర్భాగంగా ఉంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే తెలంగాణ నోట్‌పై మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన తరువాత ‘హైదరాబాద్‌’ ఐచ్ఛికాలలో ఒక దానిని నిర్ణయించే బాధ్యతను మంత్రుల బృందానికి అప్పగిస్తారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కృత నిశ్చయంతో ఉన్నందువల్ల ఈ ప్రక్రియ ఆగే అవకాశాల్లేవని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కొందరికి రక్షణమంత్రులు ఏకే ఆంటోని స్పష్టం చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలద్వారా తెలిసింది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపధ్యంలో ఆందోళనతో ఉన్న సీమాంధ్రుల సమస్యలను తెలుసుకోనేందుకు కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్యం వహిస్తున్న ఆంటోని, తన నివేదికను మరికొద్ది వారాల్లో పార్టీ నాయకత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ నోట్‌ సిద్ధమవుతున్నదని, దీనిని రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం కేంద్రం పంపిస్తుందని ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన తెలంగాణ నోట్‌ సిద్ధమవుతున్నదని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. త్వరలో ఇది కేంద్ర మంత్రివర్గం ముందుకు వస్తుందన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ విభజన ఆగదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని పునరద్ఘాటించారు. ఇదిలా ఉండగా భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని తెలంగాణలోనే ఉంచాలన్న విజ్ఞప్తితో ఖమ్మం జిల్లా నేతలు తనను కలిసినట్లు చెప్పారు. కేంద్రమంత్రి బలరాం నాయక్‌, భట్టి విక్రమార్క, రాంరెడ్డి వెంకటరెడ్డి తదితరులు దిగ్విజయ్‌ని కలిసినవారిలో ఉన్నారు. తానీషా కాలం నుంచే హైదరాబాద్‌లో భద్రాచలం అంతర్భాగంగా ఉందని దిగ్విజయ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *