Wednesday, 4 November 2026

అసెంబ్లీ ఆమోదంతో పనిలేదు

పార్లమెంట్‌ ఆమోదిస్తే తెలంగాణ రాష్ట్రం : కోదండరామ్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానంతో పనే లేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకూ రాజ్యాంగ పరమైన ప్రక్రియ మొదలు పెట్టలేదని అన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోట్‌ సిద్ధం చేసి కేబినెట్‌ ముందుకు తీసుకువచ్చి తదుపరి ప్రక్రియ ప్రారంభించాల్సిన సమయంలో ఇంకా నోట్‌ సిద్ధం కాలేదని, కేవలం ముసాయిదా మాత్రమే తయారైందని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు లీకులివ్వడం తెలంగాణ ప్రజలను ఆందోళనల్లోకి నెట్టడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాం ధ్రులు చెప్తున్నట్లు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానమే అవసరం లేదని ఆయన చెప్పారు. ఆర్టికల్‌ 3 ప్రకారం పార్లమెంట్‌ ఆమోదిస్తే దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు విభజన కోరుతున్నప్పటికీ కలిసుం డడమంటే తెలంగాణపై అధిపత్యం చెలాయించడమేనని అన్నారు. అన్నదమ్ములే కలిసుండలేనప్పుడు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల వారు ఎలా కలిసుంటారని ప్రశ్నించారు. విడిపోయాక, విభజన ప్రకటన వచ్చాక కూడా ఇంకా లసి ఉండాలని కోరుకోవడంలో అర్థం లేదన్నారు. తెలంగాణ పక్రియ ఆలస్యం కావడం వల్లే సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కొంతమంది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సీఎం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని కోదండరాం స్పష్టం చేశారు. పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని కోదండరాం అన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ సాయుధ పోరాటానికి విభజనతోనే పరిష్కారం అని అన్నారు. సకలజనుల సమ్మె 42 రోజులపాటు నిర్వహించడంలో ఉద్యోగుల పాత్ర మరువరానిదని కొనియాడారు. మన ఓట్లతో గెలిచి గద్దె ఎక్కిన వారికి భయపడొద్దని, మన చేతిలో వజ్రాయుధం ఉంచుకుని పిరికిపందల్లా బతకొద్దని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చెప్పిన రాజకీయ నేతలు మాటమార్చడం దారుణమన్నారు. ఎవరినడిగి తెలంగాణ ఇస్తున్నారంటూ మాట్లాడడం బాధాకరమన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలసి తెలంగాణ పక్రియను జాప్యం చేయమని అడగడం ఆయన రెండు కళ్లసిద్ధాంతానికి నిదర్శనమని విమర్శించారు. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే వరకూ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక విజయోత్సవ సభను నిర్వహించుకుందామని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *