
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ మరోమారు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిగతా పార్టీల్లా తాము నిర్ణయం మార్చుకోలేమన్నారు. విభజనను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. ముందుకే వెళ్తామని తేల్చి చెప్పారు. సీఎం ధిక్కార వ్యాఖ్యల రికార్డులను పరిశీలిస్తున్నామని, రాష్ట్ర విభజనపై అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలంతా కట్టుబడి ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. మూడు ప్రాంతాల ప్రజల ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాతే విభజన నిర్ణయం తీసుకున్నామని వివరించారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని తప్పుబట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు అన్ని ప్రాంతాల నేతలతో తాము మాట్లాడమని గుర్తు చేశారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉన్నామని ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలు తమతో చెప్పారని, అందువల్లే ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. అలాగే, మిగతా పార్టీలన్నింటితోనూ తాము సంప్రదింపులు జరిపామని చెప్పారు. విభజనపై ఏపీలోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని.. టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ తదితర పార్టీలు విభజనకు అనుకూలమని చెప్పాయన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీల్లాగా తాము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ మళ్లీ యూ-టర్న్ తీసుకోవచ్చు కానీ, కాంగ్రెస్ నిర్ణయం మార్చుకోదన్నారు.ముఖ్యమంత్రి కిరణ్ ధిక్కార వ్యాఖ్యలను పరిశీలిస్తున్నట్లు దిగ్విజయ్ వెల్లడించారు. కిరణ్ మాట్లాడిన అంశాలపై తనకు తెలియదన్నారు. కిరణ్ మాట్లాడిన అంశాల గురించి తెలుసుకోవాల్సి ఉందని, ఆయన తెలుగులో మాట్లాడారు కాబట్టి ఏం చెప్పారో చూడాలన్నారు. విూడియా వార్తలను బట్టి స్పందించలేనని చెప్పారు. సీఎం కిరణ్ వ్యాఖ్యల రికార్డులను పరిశీలిస్తున్నాం.. ఆ తర్వాతే స్పందిస్తామని తెలిపారు. విభజన జరిగే ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. కిరణ్ రెండు ప్రాంతాలకు ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఇంకా విడిపోలేదు కాబట్టి రెండు ప్రాంతాల ప్రజలకూ ఆయనే సీఎం అని తెలిపారు.
తెలంగాణపై వెనక్కు తగ్గేది లేదు




