Wednesday, 4 November 2026

సీఎం పక్కా తెలంగాణ వ్యతిరేకి


నక్సల్స్‌ సమస్య పెరుగుతుందని చెప్పమన్నాడు
కిరణ్‌ తమ్ముడివి భూ దందాలు
నల్లారి బండారం బయటపెట్టిన మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి
హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మాజీ డీజీపీ వి.దినేశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి తెలంగాణ రావడం ఇష్టం లేదని, ఆయన పక్కా వ్యతిరేకి అన్నారు. కిరణ్‌ సోదరుడు సంతోష్‌రెడ్డి భూకబ్జాలను అడ్డుకోవడం వల్లే తనను టార్గెట్‌గా చేశారని, డీజీపీ పదవి నుంచి తొలగించారని ఆరోపిం చారు. ముఖ్యమంత్రికి తెలంగాణ రావాలని ఇష్టం లేదని.. అందుకే తెలంగాణ వస్తే నక్సల్స్‌ సమస్య పెరుగుతుందని విూడియాతో చెప్పాలని తనపై ఒత్తిడి తెచ్చారని వెల్లడిం చారు. కిరణ్‌ సోదరుడి భూకబ్జాలను ఆపినం దుకే తనపై కక్ష కట్టారని, అనంతపురం జిల్లా ఎస్పీ శ్యాంసుందర్‌ విషయంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు నడుచుకోనేందుకే తనను డీజీపీగా కొనసాగించలేదని వెల్లడించారు. భూదందా లకు సహకరించాలని కిరణ్‌ సోదరుడు తనను బెదిరించాడని, అనంతపురం ఎస్సీని బదిలీ చేయమని ఒత్తిడి తెచ్చారన్నారు. తన పదవీ కాలాన్ని పొడిగిస్తానని చెప్పి.. ఆ తర్వాత నమ్మకద్రోహం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన మాట వినలేదు కాబట్టే కిరణ్‌ తన పదవీ కాలాన్ని పొడిగించ లేదని తెలిపారు.
ఫెయిల్యూర్‌ సీఎం
రాష్ట్ర పోలీసు మాజీ అధిపతి అయిన దినేశ్‌రెడ్డి మంగళవారం విూడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయనో ఫెయిల్యూర్‌ సీఎం అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యక్తిగత ఎజెండాతో వెళ్తున్నారని మండిపడ్డారు. కిరణ్‌ కేవలం సీమాంధ్రకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శాంతిభద్రతల విషయం కన్నా వ్యక్తిగత ఎజెండాతోనే వ్యవహరిస్తున్నాడని ధ్వజమత్తారు. సీఎంపై తాను చేస్తున్న ఆరోపణలకు అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు.
సీఎంకు తెలంగాణ రావడం ఇష్టం లేదు
తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమం వెనుక సీఎం కిరణ్‌ ఉన్నారన్న ఆరోపణలపై బలమైన ఆధారం లభించింది. అందుకే దినేశ్‌రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం. తెలంగాణ ప్రకటనకు ముందు సీమాంధ్రలో బలగాలు మోహరించేందుకు సీఎం అడ్డుపడ్డాడని దినేశ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రావడం కిరణ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని వెల్లడించారు. జూలై 30న తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత కిరణ్‌ పూర్తిగా మారిపోయారన్నారు. ఆయన ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చిందన్నారు. తెలంగాణవస్తే నక్సల్స్‌ సమస్య పెరుగుతుందని కిరణ్‌ చెప్పమన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు బలపడతారనేది ఊహాజనితమేనని వెల్లడించారు. జూలై 30న తెలంగాణపై సీడబ్ల్యూసీ ప్రకటన ముందు సీమాంధ్రలో బలగాలను మోహరించేందుకు సీఎం అడ్డుపడ్డారన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల సభకు అనుమతి ఇవ్వాలని తనపై ఒత్తిడి తీసుకువచ్చారని వెల్లడించారు. అలాగే గచ్చిబౌలిలో సీమాంధ్ర న్యాయవాదుల సమావేశానికి కూడా అనుమతి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, అయితే, అనుమతి ఇవ్వకపోవడం వల్ల తనను టార్గెట్‌ చేశారన్నారు. ముఖ్యమంత్రి ఒత్తిడి వల్లే హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగుల సభకు అనుమతి ఇచ్చానని బయటపెట్టారు.
చెప్పినట్లు వినలేదనే…
ముఖ్యమంత్రి కిరణ్‌ సోదరుడు సంతోష్‌రెడ్డి భూకబ్జాలను అడ్డుకొన్నందుకే తనపై కక్ష గట్టారని దినేశ్‌రెడ్డి ఆరోపించారు. భూదందాలకు సహకరించాలని ముఖ్యమంత్రి సోదరుడు తనను బెదిరించాడని వెల్లడించారు. అనంతపురం ఎస్పీని బదిలీ చేయాలని సీఎం తనపై ఒత్తిడి తెచ్చారని, అలాగే, గచ్చిబౌలిలో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సదస్సుకు అనుమతి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని చెప్పారు. అందుకు అంగీకరించక పోవడంతో తనపై ఆగ్రహంపై పెంచుకున్నారని తెలిపారు. కిరణ్‌ మాటను విననందుకే తన పదవీ కాలాన్ని పొడిగించ లేదన్నారు. పదవీ కాలాన్ని పొడిగిస్తానని హావిూ ఇచ్చారని, కానీ చివరకు మోసం చేశారన్నారు. రిటైర్మెంట్‌కు రెండ్రోజుల ముందు జీవోను విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ కేసును బూచీగా చూపి తనపై కుట్ర చేశారని తెలిపారు. తనపై కుట్ర పన్ని తొలగించారని, ఎందుకు కుట్ర పన్నారో అర్థం కావడం లేదన్నారు. పోలీసు శాఖ ప్రమోసన్లు అన్ని సీఎం పేషీలోనే నిర్ణయమవుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న సీఎంపై ఆరోపణలు చేస్తున్న విూపై చర్యలు తీసుకుంటే ఎలా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఇది ఎవరి బాబు జాగీరు కాదన్నారు. తాను దేన్నైనా ఎదుర్కొంటానని చెప్పారు. ‘అధికారం బాప్‌ కా జాగీర్‌ కాదు.. నాకు ఉండే మద్దతు నాకు ఉంది. నా ప్రణాళిక నాకు ఉంది’ అని ఘాటుగా బదులిచ్చారు. సీఎంపైనా చర్యలు తీసుకొనే వారు ఉంటారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు బలపడతారనేది ఊహాజనితమేనని వెల్లడించారు. తన వెనుక రాజకీయ నేతల ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ విూ వెనుక ఉండి నడిపిస్తుందా? అని అడిగిన ప్రశ్నకు.. తనకు జరిగిన అన్యాయానికి, వెన్నుపోటుకు మాత్రమే స్పందిస్తున్నానని తెలిపారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, తనపై ఉన్న అపోహలకు సమాధానం చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు. తాను అవమానాలకు గురయ్యాను కాబట్టే మాట్లాడుతున్నాని తెలిపారు. డీజీపీగా ఉన్నప్పుడు ఎలాంటి ఆరోపణలు చేయరాదని, అది క్రమశిక్షణ చర్యలకు ఆస్కారం ఇస్తుందని.. అందుకే అప్పుడు మాట్లాడలేదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని మరో ప్రశ్నకు బదులిచ్చారు. వాస్తవానికి ఇప్పుడు పదవిలో లేకపోవడం మంచిదేనని అనిపిస్తోందని.. ఎస్పీలు, డీఎస్పీల బదిలీలలో విపరీతమైన ఒత్తిడి చేసేవారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *