
బాబు నీ లేఖ ప్రకారమే చేశాం కదా !
దీక్ష ఎందుకు చేస్తున్నవు
దిగ్విజయ్‌సింగ్ చురక
న్యూఢిల్లీ, అక్టోబర్ 8 (జనంసాక్షి) :
తెలంగాణపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని.. ఆ నిర్ణయం నుంచి వెనక్కు వెళ్లేది లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ నిర్ణయంపై ఇప్పుడు వెనక్కి వెళ్లడం అసాధ్యమని తేల్చి చెప్పారు. తెలంగాణపై వెనక్కు తగ్గేది లేదని పునరుద్ఘాటించారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు తక్షణమే ఆందోళనలు విరమించాలని దిగ్విజయ్‌సింగ్ విజ్ఞప్తి చేశారు. సీమాంద్ర, తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం దిగ్విజయ్ ఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సమ్మె చేస్తున్న ఏపీఎన్జీవోలు సమ్మె విరమించుకోవాలని కోరారు. ఉద్యోగుల సమ్మె వల్ల ఆస్పత్రులు, రైళ్లు, ఇతర రంగాల్లో విద్యుత్ నిలిచిపోయి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. ఆస్పత్రులలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైళ్లు నిలిచిపోయాయని తెలిపారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలను తాము గుర్తించామని, వారి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగులతో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని చెప్పారు. సీమాంధ్రలో ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా తక్షణమే ఆందోళనలు, సమ్మె విరమించాలని కోరారు.అన్ని పార్టీలు లిఖిత పూర్వకంగా అంగీకరించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయంపై తీసుకుందని దిగ్విజయ్ గుర్తు చేశారు. ఇప్పుడు ఒకటి, రెండు పార్టీలు మాట మార్చడం ఆశ్చర్యకరమన్నారు. అయితే, వారిలా తాము విధానాలను మార్చుకోబోమని స్పష్టం చేశారు. చంద్రబాబు గతంలో అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని, ఆయన దీక్ష చేయడంలో అర్థం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనూ అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకున్నామని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. పార్టీ నేతలంతా క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. అయితే, హైకమాండ్ నిర్ణయాన్ని ధిక్కరించే వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయా? అని ప్రశ్నించగా.. ఆయన సమాధానమివ్వలేదు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలు తాము గుర్తించామని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదు




