Tuesday, 3 November 2026

రతన్‌గఢ్‌ ఆలయంలో ఘోరం


తొక్కిసలాటలో 89 మంది మృతి
మృతుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు
సిందూ నదిలో పలువురి గల్లంతు
భోపాల్‌, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) :
మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో ఘోర దుర్ఘటన ఆదివారం చోటు చేసుకుంది. దసరా పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో రతన్‌గర్‌లోని దుర్గామాత ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తు లు చేరుకున్నారు. భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో క్యూలైన్‌లో తొక్కిస లాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 89 మంది మరణించారు. మరో 100 మంది గాయపడ్డారు. సిందూ నదిలో పడి మరో 30మంది గల్లంతయి ఉంటారని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అధికంగా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జరిగిన దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మెజిస్టీరియల్‌ దర్యాప్తునకు ఆదేశాలిచ్చారు. దుర్ఘటన సిందూనది సమీపంలో ఉన్న వంతెన వద్ద చోటు చేసుకుంది. దుర్ఘటన జరిగిన సమయంలో సుమారు 50వేల మంది భక్తులు ఉన్నట్టు సమాచారం. ఈ దుర్ఘటనపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో 31 మంది మహిళలు, 17 మంది పిల్లలు ఉన్నట్టుగా అధికారవర్గాలు వెల్లడించాయి. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం 1.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేల పరిహారం ఇస్తామని తెలిపింది. సిందూ నదిపై గల వంతెన కూలిపోతుందనే వదంతి కారణంగానే తొక్కిసలాట జరిగిందని అధికారులు చెప్తుండగా, భారీ సంఖ్యలో వచ్చిన భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతోనే ఈ దుర్ఘటన జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *