Tuesday, 3 November 2026

తెలంగాణ నెక్లెస్‌గా అలయ్‌ బలయ్‌


ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకూ అప్రమత్తంగా ఉందాం : కోదండరామ్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) :
హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డు తెలంగాణ అలయ్‌ బలయ్‌కు హారంలా నిలిచింది. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో మంగ ళవారం సందడిసందడిగా మారింది. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఏటా దసరా పండుగ మరుసటి సందర్భంగా నిర్వ హిం చే అలయ్‌-బలయ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలి సిందే. అదేవిధంగా మంగళవారం కూడా అలయ్‌-బలయ్‌ నిర్వ హించారు. పీపుల్స్‌ప్లాజా ప్రముఖులతో సందడిసందడిగా మారిం ది. లంబాడా నృత్యాలు, బతుకమ్మ ఆటపాటలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించే వరకూ అప్రమత్తంగా ఉందామని పిలుపునిచ్చారు. సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తులు ఈ సమయంలోనూ గుంటనక్కల్లా వ్యవహరిస్తూ తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకూ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉందామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాకారమయ్యే వరకూ ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కె.జానారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బిజెపి సీనియర్‌ నేత లక్ష్మణ్‌, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఉద్యోగుల సంఘం ప్రతినిధి దేవీప్రసాద్‌, జస్టిస్‌ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విందు భోజనంలో 30 వంటకాలు తయారు చేసినట్టు సమాచారం. అలయ్‌-బలయ్‌కు విచ్చేసిన పలువురు నేతలు ఇలా వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది ఇద్దరు సీఎంలతో..
వచ్చే దసరాకు నిర్వహించునున్న అలయ్‌-బలయ్‌లో రెండు రాష్ట్రాల సీఎంలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్టు బిజెపి సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారంనాడు తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. రెండు ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం ఒక ఫెస్టివల్‌ సిటీ అని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రెండుగా విడిపోయి బాగు పడదామని సీమాంధ్ర నేతలకు పిలుపునిచ్చారు. విడిపోవడం వల్ల రెండు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు సహకరించాలని కోరారు. బిజెపి నేత నాగం జనార్దనరెడ్డి మాట్లాడుతూ తెలంగాణను ఎవరూ ఆపలేరన్నారు. రాష్ట్రం ఏర్పడినట్టేనన్నారు. ఎవరు ఆపినా ఆగబోదన్నారు. బిజెపి సహకారంతో తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *