Wednesday, 4 November 2026

వారు ఒక్కగూటి పక్షులే : బాబు


హైదరాబాద్‌, అక్టోబర్‌ 18 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఒకే గూటి పక్షలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఇరు ప్రాంతాల అన్ని జెఎసిలతో చర్చించండి.. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి.. ఆ తర్వాత స్పష్టత ఇవ్వండి.. ఆపై తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని అమలు చేయండి అంటూ కాంగ్రెస్‌ పార్టీని కోరారు. తన నివాసంలో మీడియాతో శుక్ర వారం మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ కుఠిల రాజకీయాలకు తెరదిం చేందుకే తాను పోరాటం చేస్తున్నా నన్నారు. విభజనపై కాంగ్రెస్‌ తీరు ను తన దీక్ష ద్వారా జాతీయ స్థాయి కి తీసుకెళ్లానని అన్నారు. తెలుగు జాతి విచ్ఛిన్నానికి కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్ను తోందన్నారు. తన దీక్షకు జాతీయ స్థాయి నాయకులు అపూర్వంగా స్పందించారన్నారు. ప్రజలు కూడా భారీగా తరలి వచ్చి సంఘీభావం తెలిపారన్నారు. దీక్ష ద్వారా తన పోరాటం చాలావరకు విజయవంతమైందన్నారు. దేశంలో అవినీతి భయంకరమైన సమస్యగా మారిందన్నారు. బొగ్గు కుంభకోణం రోజుకో మలుపు తిరుగు తోందన్నారు. ప్రధాని సంతకం చేసిన ఫైళ్లకే దిక్కులేదంటే అంతకంటే దారుణం మరొకటి లేదన్నారు. నివేదికలో మార్పులు చేశారని సుప్రీంకోర్టు సైతం తప్పుబట్టిందన్నారు. అవినీతిపరులను కాపాడేందుకు యత్నిస్తున్నారన్నారు. న్యూఢిల్లీ మొత్తం బ్రోకర్ల రాజ్యంగా మారిందన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. టెన్‌జనపధ్‌కు కాంగ్రెస్‌ నాయకులు కట్టు బానిసలుగా మారారన్నారు. నల్లధనం వెనక్కి తీసుకురావడంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆర్థిక మంత్రి చిదంబరం ఎందుకు మాట్లాడరో తనకు అర్ధం కావడం లేదన్నారు. సోనియా స్క్రిప్టును జగన్‌, టిఆర్‌ఎస్‌ నేత కెసిఆర్‌కు పంపే పోస్టుమ్యాన్‌ దిగ్విజయ్‌సింగ్‌ అని అన్నారు. బొగ్గు, విద్యుత్‌ లేక సామాన్యులు సైతం విలవిల లాడుతున్నారన్నారు. పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయన్నారు. అక్టోబర్‌ నెలంటే వర్షాలు కురిసే సమయం.. భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. రిజర్వాయర్లు నిండుగా ఉన్నాయి.. అయినా కరెంటు కోత ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. పాలన పూర్తిగా కుంటుపడిందన్నారు. రాష్ట్రంలోను, దేశంలోను అసలు పాలనే లేదన్నారు. ఆర్థిక సంస్కరణలకు ముందు ఉన్న వృద్ది రేటు ప్రస్తుతం ఉండడం విచారకరమన్నారు. నిత్యావసరాలతో సహా అన్నింటి ధరలు పెరిగిపోయాయన్నారు. వాటిని నియంత్రించే వాడే లేడన్నారు. చాలీచాలని ఆదాయంతో సామాన్యులు విలవిలలాడుతున్నారన్నారు. మధ్యతరగతి ప్రజలు సైతం గుండెలు బాదుకుంటున్నారన్నారు. ప్రజల బాగు కోసం విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తెచ్చి.. మిగులు విద్యుత్‌ను సృష్టిస్తే.. ప్రభుత్వాన్ని కోల్పోయామన్నారు. యుపిఎ ప్రభుత్వ అసమర్ధత వల్ల పాలన కుంటుపడిందన్నారు. రాష్ట్రం, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఏం చేయాలా అన్న దానిపై యోచిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. విభజన నిర్ణయంపై ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారన్నారు. గంటగంటకో మాట మాట్లాడుతూ దిగ్విజయ్‌సింగ్‌.. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలీని స్థితికి చేరుకున్నారన్నారు. నిన్నటి వరకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామా ఆడారన్నారు. ప్రతి ఒక్కరూ నాటకాలాడుతున్నారన్నారు. జీవోఎం ప్రతినిధులు కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారన్నారు. విభజన నిర్ణయంపై.. ఆన్‌లైన్‌లో అభిప్రాయం తెలియజేయాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎస్‌ఎంఎస్‌లు పంపండి.. మెసెజ్‌లు పంపండి అంటూ వ్యాఖ్యలు చేయడం సమంజసంగా లేదన్నారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని దశదిశలా చాటిన రాష్ట్రాన్ని.. తెలుగు జాతిని రెండు ముక్కలు చేసేందుకు యత్నించడం బాధకరమన్నారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి  విదేశాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. జగన్‌, టిఆర్‌ఎస్‌ను చూసుకుని కాంగ్రెస్‌ పార్టీ తన కాళ్లను తానే నరుక్కుందన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి ఉన్నతి కోసం స్థాపించిన పార్టీ అని అన్నారు. తెలుగు జాతి విచ్ఛిన్నమవుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. మంత్రుల బృందం ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పడం లేదన్నారు. 175 నియోజకవర్గాలకు పరిమితమై ఆందోళనలు చేసేవారు సమైక్యవాదులు ఎలా అవుతారని ప్రశ్నించారు. నీటి పంపకాలపై, ఉద్యోగాల విషయాలపై, హైదరాబాద్‌ విషయంపై స్పష్టత ఇవ్వకుండా విభజనకు పూనుకుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. తమ పాలన పారదర్శకంగా ఆద్యంతం కొనసాగిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజల కోసం కష్టపడ్డ ప్రతి అధికారి తమ సర్వీసులో ఉన్నతస్థాయికి వెళ్లారన్నారు. వైఎస్‌ఆర్‌ పాలనలో పనిచేసిన వారు మాత్రం జైలు పాలయ్యారని అన్నారు. రాజ్యాంగం ఉంది.. మంచి సంప్రదాయాలున్నాయి..ఇరు ప్రాంతాల జెఎసి ప్రతినిధులను, ప్రజల తరఫున కొందర్ని ఒకచోటకు చేర్చి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *