నాగార్జున సాగరే కావాలి : అశోక్బాబు
హైదరాబాద్, అక్టోబర్ 18 (జనంసాక్షి) :
అందని ద్రాక్ష పుల్లన అనే సామెతను ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు అక్షరాల నిజం చేశాడు. గుంటూరు జిల్లా విజయపూరిలోని జింఖానా గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన ఏపీఎన్జీవోల సభలో అశోక్బాబు పాల్గొని మాట్లాడారు. తమను హైదరాబాద్ కావాలా.. నాగార్జున సాగర్ కావాలా అని అడిగితే మొదటి ప్రాధాన్యత నాగార్జునసాగర్ కే ఇస్తామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కాలుష్యంతో నిండిపోయిందని తెలిపారు. నాగార్జునసాగర్ అహ్లాదంగా, ప్రశాంతంగా ఉందని, కాబట్టి తమకు నాగార్జున సాగరే కావాలని అన్నారు. పార్టీలన్నీ సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తోందని అన్నారు. ఉద్యోగుల సమ్మె వల్లే విభజన ఆగిందని అన్నారు. కేంద్రంలోను,రాష్ట్రంలోను అధికారంలోకి వచ్చేందుకే సోనియాగాంధీని రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తోందన్నారు. తుపాను ముందు నిశ్శబ్దం లాంటిదే సమ్మె విరమణ అన్నారు. హైదరాబాద్ రాజధాని కావడంతో ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అన్ని ప్రాంతాల వారి కృషి ఉందని అన్నారు. పార్టీ ఆఫీసులో కూర్చుని లేఖ రాసి ఇస్తే రాష్ట్రాన్ని విభజిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేంతవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.
హైదరాబాద్ కాలుష్యంతో నిండింది.. మాకొద్దు





