
హిందాల్కో వివాదంపై పీఎంవో స్పష్టీకరణ
న్యూఢిల్లీ, అక్టోబర్ 19 (జనంసాక్షి) :
బొగ్గు బ్లాకుల కేటాయింపులో ప్రధాని మన్మోహన్సింగ్ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. హిందాల్కోకు బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ప్రధాని మన్మోహన్సింగ్ తప్పు చేయనే లేదని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. వివాదాస్పద బొగ్గు క్షేత్రాల కేటాయింపుపై ప్రధాని కార్యాలయం మొదటి సారిగా మౌనం విడి వివరణ ఇచ్చింది. హిందాల్కోకు బొగ్గు బ్లాకుల కేటాయింపులో ప్రధాని ఎలాంటి తప్పూ చేయలేదని వెనకేసుకొచ్చింది. బొగ్గు మంత్రిత్వ శాఖకు వచ్చిన దరఖాస్తుల్లో అర్హతల ఆధారంగానే ప్రధాని హిందాల్కోకు బొగ్గు క్షేత్రాలు కేటాయించారని పీఎంవో పేర్కొంది. 2005లో బొగ్గు మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను ఆమోదించే సంపూర్ణ అధికారం ప్రధాన మంత్రికి ఉందని, ఆ అధికారం మేరకే కేటాయింపులు చేపట్టినట్టు తెలిపింది. ప్రభుత్వరంగ సంస్థ నైవేలి లిగ్నయిట్ కార్పొరేషన్ ప్రయోజనాలను పణంగా పెట్టి హిందాల్కోకు బొగ్గు బ్లాకులు కేటాయించారనే ఆరోపణలు అవాస్థవాలేనని పీఎంవో స్పష్టం చేసింది. ఒడిశాలోని తాలాబిరా బొగ్గు బ్లాకుల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ ఆదిత్యాబిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్పై సీబీఐ కేసులు నమోదు చేయడంతో వివాదం రాజుకుంది. తాను కుట్రకు పాల్పడి ఉంటే సవరించిన నిర్ణయాన్ని ఆమోదించిన ప్రధాని మన్మోహన్ కూడా కుట్రదారుడేనని పరేఖ్ ఆరోపించిన విషయం తెలిసిందే. హిందాల్కోకు బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ గతంలో సిఫార్సు చేసిన తుది నిర్ణయానికి తేడా ఉందని పీఎంవో పేర్కొంది. దరఖాస్తుదారులలో ఒకరి నుంచి ప్రధానమంత్రి కార్యాలయానికి వినతిపత్రం అందగా దాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖకు నివేదించారని తెలిపింది. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. కేటాయింపునకు ముందు జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలకు సంబంధించిన కొన్ని పత్రాలు సీబీఐ వద్ద ఉన్నాయని, ఈ వివాదంపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుందనే ఆశాభావం పీఎంవో వ్యక్తం చేసింది.
ప్రధాని తప్పు చేయలేదు




