
ఉమ్మడిగా మూడేళ్లు చాలు
మంత్రుల బృందానికి టీ జేఏసీ నివేదిక
కోదండరామ్ వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 19 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణ ప్రాంతానికి తగిన న్యాయం చేయాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌ను మూడేళ్లకు మించి ఉమ్మడి రాజధానిగా ఉంచవద్దని, ట్రిబ్యునల్స్ తీర్పుల ప్రకారమే రెండు ప్రాంతాలకు నీటి పంపిణీ చేయాలని డిమాండ్ చేసింది. పదకొండు అంశాలపై కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక పంపించామని టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. నివేదికలోని అంశాలను వెల్లడించారు. హైదరాబాద్, శాంతిభద్రతలు, విద్యుత్, నీటిపారుదల, ఆస్తులు, అప్పులు, హైకోర్టు, విద్యారంగం, ఆరోగ్యం, పోలవరం ప్రాజెక్టు, ఆర్టికల్ 371 (డి), సింగరేణి బొగ్గు గనులు, గ్యాస్ కేటాయింపులకు సంబంధించిన అంశాలను ప్రధానంగా కేంద్ర మంత్రివర్గ బృందానికి నివేదించినట్లు చెప్పారు. హైదరాబాద్‌ను మూడేళ్లకు మించి ఉమ్మడి రాజధానిగా ఉంచవద్దని కేంద్ర మంత్రుల బృందాన్ని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్‌పై సంపూర్ణ అధికారాలు తెలంగాణకే ఉండాలని స్పష్టం చేశారు. అధికారాల బదలాయింపులు అంగీకరించబోమని తేల్చి చెప్పారు. అలాగే, నగరంపై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని, ఇక్కడ ఉండే వారికి ప్రత్యేక రక్షణలు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దేశంలోని పౌరులదరికీ ఉన్న రక్షణలే ఇక్కడ కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 371 (డి) రాష్ట్రపతి ఉత్తర్వులను కొననసాగించాలని కోరామన్నారు. ట్రిబ్యునళ్ల నిబంధనల మేరకే నీటి పంపకాలు జరగాలని, తెలంగాణ ప్రాజెక్టులకు సరిపడా గ్యాస్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనతో పాటు హైకోర్టు విభజన కూడా జరగాలని డిమాండ్ చేశారు. 610 జీవో, గిర్‌గ్లానీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగుల విభజన చేయాలని కోరారు. 371 (డి) యథాతథంగా కొనసాగించాలని, దీనివల్ల బహిర్గత వలసలను అరికట్టడానికి వీలవుతుందని, జిల్లాల మధ్య కూడా సమస్యలు ఉండవని అభిప్రాయపడ్డారు. విభజన సందర్భంగా ఉద్యోగుల పంపిణీలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఉద్యోగులు ఏ ప్రాంతం వారో గుర్తించేందుకు ఎస్‌ఆర్‌లోని ఎంట్రీని పరిశీలించాలని, ఇక్కడ స్థానికతను పేర్కొంటారని, దాని ఆధారంగా ఉద్యోగులను పంపిణీ చేయాలని కోరారు. సింగరేణిపై ఇప్పుడున్న అధికారాన్ని కొనసాగించాలని, జీవో 53 ప్రకారం విద్యుత్ కేటాయింపులు జరపాలని, అవసరం మేరకు అదనపు గ్యాస్ కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు.
హైదరాబాద్‌పై తెలంగాణకే సంపూర్ణ అధికారాలు




