Tuesday, 3 November 2026

విభజన ఆగదు


– ఏం కావాలో అడుగుదాం
– కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి
గుంటూరు, అక్టోబర్‌
20 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ విభజన ఇక అనివార్య మని, ఏమి చేసిన ఆగదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం తన నియోజకవర్గ కేంద్రం బాపట్లలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విభజనపై చాలా ముందుకెళ్లిందని తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం ఏమి కావాలో అడుగుదామని చెప్పారు. అయితే తాను హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతానని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున బాపట్ల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఆమె తేల్చిచెప్పారు. కొందరు స్వార్థపరులు కాంగ్రెస్‌ను వీడినంత మాత్రాన సముద్రం లాంటి పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లబోదని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనను నిరసిస్తూ కొందరు కాంగ్రెస్‌ నాయకులు పార్టీ వీడబోతున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆమె స్పందన కోరగా పై విధంగా స్పందించారు. పార్టీ వీడాలనుకున్న వారెవరైనా ఉంటే ఆ పని త్వరగా పూర్తి చేయాలని ఆమె కోరారు. స్వార్థపరులు పార్టీని వీడితే ఎలా బలోపేతం చేసుకోవాలో పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *