
వరంగల్, అక్టోబర్ 21 (జనంసాక్షి) :
సీమాంధ్ర నేతలు ఒంగోలు, గుంటూరు జిల్లాల్లో భారీగా భూములు కొంటూ సమైక్య పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం వరంగల్ జిల్లా మహబూబా బాద్‌లో నూతనంగా నిర్మించిన సీపీఐ డివిజన్ కార్యాలయం (వీరభవన్)ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లా డారు. అవినీతి పరులతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే దేశాన్ని అవినీతి పరులకు అప్ప చెప్పడమే కాక భవిష్యత్తులో కమ్యూనిస్టులను పాతాళ లోకానికి నెట్టివేసిన వాళ్లమవుతామన్నారు. వైఎస్సార్సీపీతో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టుల భవిష్యత్తు అంధకారమేనని, అవినీతి పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినా కమ్యూనిస్టు పార్టీలు భూమండలం ఉన్నంత కాలం ఉంటాయని చెప్పారు. అమరుల త్యాగం వల్లనే కమ్యూనిస్టులు నిలబడ్డారని, మన అమరులే నాడు అవినీతి పరులైతే ఈ రోజు కమ్యూనిస్టులు ప్రజల్లో ఉండేవారు కాదన్నారు. సీపీఐ నేత రాఘవులు భవిష్యత్తులో కూడా సీపీఐతో కలిసి ఉంటామనడాన్ని ఆహ్వానిస్తున్నామని, కాని కమ్యూనిస్టుల ఐక్యత అంటూనే పక్క చూపులు ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. కమ్యూనిస్టుల ఐక్యతకు ముందున్నది సీపీఐ మాత్రమేనని, గతంలో ఖమ్మంలో గిరిప్రసాద్ లాంటి విప్లవకారుడిపై, పువ్వాడ నాగేశ్వర్ రావుపై పోటీ పెట్టింది సీపీఎం మాత్రమేనని, మంగళగిరిలో సీపీఐ సీటుపై కూడా పోటీ పెట్టి ఐక్యతకు తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. రాజకీయ విధానాల ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమని, తెలంగాణపై అన్ని పార్టీలు అనుకూలమని చెప్పి కేంద్రం తెలంగాణ ప్రకటన వెలువరించగానే సీమాంధ్రలో ప్రజల ఆందోళనలను చూసి వైఎస్‌ఆర్‌సిపి, టీడీపీలు మాట మార్చి నాటకాలాడుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడొక మాట అక్కడొక మాట చెబుతున్నారని, సిపిఎం మాత్రం స్తబ్దంగా ఉన్నదని, ఒక్క సిపిఐ మాత్రమే 23 జిల్లాల్లో ఒకే మాటపై కట్టుబడి ఉందన్నారు. 2004లో ఏపి కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలం కాబట్టే ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడిన టిఆర్‌ఎస్‌తో పాటు సిపిఐ, సిపిఎంలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిందని, నేడు టిఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎంల వైఖరి మారలేదని, కాని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తుంటే ఆ పార్టీ అధిష్టానం ఎలా చూస్తూ ఊరుకున్నదని ప్రశ్నించారు. సమైక్యత కాపాడుతామని చెబుతున్న సీమాంధ్ర ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భూములెందుకు కొంటున్నారని నారాయణ ప్రశ్నించారు. లగడపాటి లాంటి ఎంపిలులు రాజకీయ పబ్బం గడుపుకునేందుకే ప్రయత్నిస్తూ పగటి వేషగాళ్ల మాదిరిగా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి ఎంపిలే కారణమని, వారి అవకాశవాదం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. రాజకీయ పార్టీలన్నీ ఒకే విధానంపై నిలబడితేనే ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు. రెండు రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు సహజంగానే నీటి సమస్యలు, ఉద్యోగాల సమస్యలు వస్తాయని, ప్రస్తుత రాష్ట్ర విభజన సమయంలో సిపిఐగా తాము కూడా మేధావులతో, వివిధ రంగాల నిపుణులతో చర్చించి డిల్లీకి వెళ్లి హ ోం మంత్రి షిండేకు ఆయా ఆంశాలపై నివేదిక అందిస్తామని, ఆ తరువాత వాటి సాధనకు పోరాడుతామని చెప్పారు. తెలంగాణ పునర్మీర్మాణంలో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి, పరిశ్రమల సాధనకు, ఇళ్ల స్థలాలు, సాగుభూముల సాధనకు పోరాటాలు తప్పవని, వచ్చే తెలంగాణలో సిపిఐ బలోపేతానికి వామపక్ష శక్తులను, మేధావులను కూడగట్టి ప్రజలతో ముందుకు సాగుతామన్నారు. ఏ పార్టీ అయినా తమ రాజకీయ కార్యక్రమాలు నడుపుకోవచ్చని, పదవుల కోసం విలీనం అవుతామని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణలో వెయ్యి మంది బలిదానం చేసింది ఇలాంటి వారి పబ్బం గడుపుకోవడానికి కాదని, అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదవుల కోసం యత్నిస్తే అలాంటి పార్టీకి ఘోరి కడుతారని హెచ్చరించారు. మరోవైపు కేంద్రంలో రూ.10లక్షల కోట్ల విలువైన బొగ్గు కుంభకోణంలో ప్రధాని పాత్ర ఉందన్న ఆరోపణలు వస్తున్నాయని, ఎన్డీఎ మాత్రం తమకు ఈసారి అవకాశం ఇవ్వాలంటే మైనార్టీలను ఊచకోత కోసిన మోడీని దేశంపైకి వదిలిపెట్టిందని విమర్శించారు. బిజెపి నేత మోడీ ప్రధాని అయినా ఫర్వాలేదు కాని, తమకు ముఖ్యమంత్రి సీటు కావాలని చంద్రబాబు ఆ పార్టీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారని, అదే జరిగితే టిడిపి మరింత దిగజారి నష్టపోతుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన అనంతరం మిగులు భూమిని పంచే వరకు భూపోరాటాలు నిర్వహిస్తామని, పేదల కోసం వందసార్లు మళ్ళీ జైలుకు వెళ్ళడానికైనా సిద్దమేనన్నారు. ప్రజలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, సాగు భూముల కోసం తెలంగాణ కావాలే తప్ప వట్టి తెలంగాణ కోసం పోరాడటం లేదన్నారు. అనేక ఆటుపోట్లను తట్టుకొని సిపిఐ నిలబడిందని, పార్టీ కార్యకర్తలకు ఇళ్ళు లేకున్నా కార్యాలయాలను నిర్మించుకుంటున్నారని, అది సిపిఐకి మాత్రమే సాధ్యమని అన్నారు. ఈ సభకు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి. విజయ్ సారధి అధ్యక్షత వహించగా, సిపిఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, రాష్ట్ర నాయకులు మడత కాళిదాస్, జిల్లా సహాయ కార్యదర్శి తమ్మెర విశ్వేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజా రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మోతె లింగా రెడ్డి, మేకల రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు బి. అజయ్, పడాల దేవయ్య, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు చాగంటి కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో భూములు కొంటూ సమైక్య పోరాటం చేస్తారా




