Tuesday, 3 November 2026

ఇంకా సమైక్యమంటే ప్రజలు తరిమికొడుతరు


సీఎం, ఉండవల్లిలకు కేకే, వివేక్‌ హెచ్చరిక
హైదరాబాద్‌, అక్టోబరు 21 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఇంకా సమైక్యమంటే ప్రజలు తరిమికొడుతరని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు, ఎంపీ వివేకానంద హెచ్చరించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణను ఆపేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై మంత్రుల బృందానికి తప్పుడు నివేదిక ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి పార్టీ సొంత విషయాలను ప్రజల్లో మాట్లాడటం సరికాదని కేకే అన్నారు. విభజన జరిగితే నీటి సమస్యలు తలెత్తుతాయని సీఎం వ్యాఖ్యానించడం చూస్తుంటే సీమాంధ్రులను రెచ్చగొట్టేందుకేనని ఆయన అన్నారు. ఆర్టికల్‌ 371డి ఎలాంటి అపోహలు కల్పించవద్దన్నారు. ప్రపంచంలో ఏ అంశంపై జరగనంత చర్చ తెలంగాణపై జరిగిందని కేకే అన్నారు. వైఎస్సార్‌సీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో సభ పెట్టడం సరికాదని అన్నారు. ఆ పార్టీలోని సీనియర్‌ నేతలు మైసురారెడ్డి వంటి నేతలు జగన్‌కు సలహాలు ఇవ్వాలన్నారు. తెలంగాణకు కేసీఆర్‌ వ్యతిరేకమంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు.  తెలంగాణ కోసం కేసీఆర్‌ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమించారని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించినవారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని, అయినా తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ వెనక్కి పోలేదన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణపై ఉండవల్లికి అవగాహన లేదని, ఇది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రపతి రాజ్యాంగానికి ఎప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించబోరని అన్నారు. తెలంగాణ తుపాన్‌ కాదని, అది ఒక ఉప్పెన అని కేకే అన్నారు. ఈ ఉప్పెనలో సీఎం కుట్టుకుపోవడం ఖాయమన్నారు. ఆరి పోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టుగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా సీఎంను అడ్డుకునే బాధ్యతను తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తీసుకోవాలని కేకే అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎప్పుడో నిర్ణయం జరిగిపోయిందన్నారు. అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటానని సీఎం చెప్పడంలో అర్థం లేదన్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత వివేక్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పచ్చి అబద్ధాల కోరు అని మండిపడ్డారు. తెలంగాణను అడ్డుకుంటామని సీఎం మూర్ఖంగా మాట్లాడుతున్నారన్నారు. సీఎం ఇన్నాళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసి, ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. సీఎం తన స్థాయిని మరిచి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. 60 సంవత్సరాల నుంచి తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరుకుంటే ఆ పదవికి రాజీనామా చసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు. సీఎంకు దమ్ముంటే తెలంగాణ ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన సవాల్‌ విసిరారు. తెలంగాణపై ఉండవల్లి చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో సభ పెట్టేబదులు సీమాంధ్రలో సభ నిర్వహిస్తే మంచిదని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *