Tuesday, 3 November 2026

నన్నూ చంపుతారేమో.. ఐ డోంట్‌కేర్‌

నానమ్మ, నాన్నను హత్య చేశారు
భాజపా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోంది
గుజరాత్‌, యూపీ, కాశ్మీర్‌లో అగ్గిపెట్టారు
నిప్పు పెట్టడం సులభం.. చల్లార్చడమే కష్టం
సంఘ్‌ పరివార్‌పై రాహుల్‌ ఆర్పార్‌
జైపూర్‌, అక్టోబర్‌ 23 (జనంసాక్షి) :
నాయనమ్మ, నాన్న కులమత రాజకీయాలకే బలైపో యార ని.. అలాగే తనను కూడా ఏదో ఒక రోజు చంపేస్తారే మోనని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. బుధవారం రాజస్థాన్‌లోని చురు ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. విద్వేష రాజకీయాలు దేశ లౌకికతత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు. తన నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్‌ గాంధీ హత్యోదంతాలను గుర్తు చేసుకుంటూ ఆయన మాట్లాడారు. ద్వేషం తమ నానమ్మను చంపిందని, తన తండ్రి విషయంలోనూ అదే జరిగిందని, తన విషయంలోనూ అది జరగవచ్చునని, దానికి తాను భయపడడం లేదని ఆయన అన్నారు. వాళ్లు ముజఫర్‌నగర్‌, గుజరాత్‌, కాశ్మీర్‌ వెళ్లి అగ్గిపెట్టారన్నారు. నిప్పు పెట్టడం చాలా సులభమని.. చల్లార్చడమే కష్టమని చెప్పారు. 1984లో తమ నానమ్మ ఇందిరా గాంధీని చంపిన ఉదంతాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తమ నానమ్మను చంపేశారని తన సెక్యూరిటీ- ఆఫీసర్‌ చెప్పాడని, తన కాళ్లు వణికాయని, ప్రియాంకనూ తననూ ఇంటికి తీసుకుని వెళ్లారని, రోడ్డుపై రక్తం పారుతోదని, గదిలో తమ మిత్రులపై రక్తం ఉందని ఆయన చెప్పారు. పద్నాలుగేళ్ల వయస్సులో ఉన్న తనను సమాచారం తెలిసిన వెంటనే తనను బడి నుంచి ఇంటికి పంపారని ఆయన చెప్పారు. తమ నానమ్మను చంపిన బియాంత్‌ సింగ్‌, సత్వంత్‌ సింగ్‌ తనతో బ్యాడ్మింటన్‌ ఆడారని ఆయన గుర్తు చేసుకున్నాడు. బియాంత్‌, సత్వంత్‌ సింగ్‌లు తన మిత్రులని, బ్యాడ్మింటన్‌ ఎలా ఆడాలో తనకు నేర్పారని ఆయన చెప్పారు. 1984లో తోటలో తాను బియాంత్‌ సింగ్‌ను కలిశానని, విూ నానమ్మ ఎక్కడ పడుకుంటారని అడిగాడని, భద్రత సరిపోతుందా అని ప్రశ్నించాడని, గ్రెనేడ్‌ విసిరితే ఎలా కింద పడుకోవాలో చూపించాడని, అప్పుడు అతను ఎందుకు అలా చెపుతున్నాడో అర్థం కాలేదని, దీపావళి సందర్భంగా వారిద్దరు నానమ్మపైకి గ్రెనేడ్‌ విసరాలని అనుకున్నారని తర్వాత తెలిసిందని ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *