
హైదరాబాద్, అక్టోబర్ 23 (జనంసాక్షి) : ఈశాన్య రుతుపవనాలు బలంగా వీస్తుండడంతోపాటు, బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుఫానుగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు విస్తారంగానే కురుస్తున్నాయి. అయితే ఈమూడు జిల్లాల్లో మాత్రం పెద్ద ప్రభావం లేదనే చెప్పవ చ్చు. చిట్టచివరికి హైదరాబాద్లో కూడా భారీ వర్షాల వల్ల చాలా కాలనీలు అవస్థలు పడ్డాయి. నాళాలు పొంగి పొర్లాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.అయితే ఈ వర్షాలకు సీమాంధ్ర జిల్లాలు పూర్తిగా అతలాకుతలం అవుతున్నాయి. జనజీవనం స్థంబించి పోయింది. రవాణా వ్యవస్థ చిన్నా బిన్నమైంది. విద్యుత్ సరఫరా చాలా గ్రామాల్లో నిలిచిపోయింది. చాలా పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయంలోనే కొనసాగుతున్నాయి.అధికారులు అప్రమత్తం అయినా కూడా ఎలాంటి సహాయం చేసే పరిస్థితిలో లేక పోవడంతో ప్రజలు ఎవరి దారి వారే వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరువరకు కూడా ప్రతి జిల్లాలో వర్షాల ప్రభావం తీవ్రంగా చూపిస్తోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. విజయనగరం జిల్లాలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు గాను నాలుగు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సవిూక్షిస్తున్నారు. విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లకుగురవుతున్నారు. రోడ్లపై కూడా బాగా నీరు ప్రవహిస్తుండడంతో వాహనాలు కూడా వెల్లడం ఇబ్బందిగా మారుతోంది. ప్రకాశం బ్యారేజికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అప్రమత్తమైన అధికారులు 30గేట్లను ఎత్తివేసి వరద నీటిని బయటకు పంపిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీంతో పాటు ఈదురు గాలులప్రభావం తీవ్రంగానే ఉండడంతో ఉదయం దర్శనాలు చేసుకోవాల్సిన భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వరి, మిర్చి, పత్తి, మొక్క జొన్న పంటలు భారీగా నష్టపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూర్లో భారీగా పంట నష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. యలమంచిలి ఎస్సార్ కాలనీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇళ్లల్లోకి వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. ఈవర్షాల వల్ల రైతుల పంటలకు పెద్దగా నష్టం కలిగే అవకాశాలు ఏమి లేవని అధికారులు పేర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. చీరాల-ఒంగోలు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు వరదనీరు భారీగా తరలివస్తోంది. భారీ వర్షాలు మరో 48గంటల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం జిల్లాలో చిన్న వాగు పొంగుతుండడంతో దుద్దుకూరు-నాగులుప్పుడుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంగవరం వద్ద అప్పేరు ప్రాజెక్టు వరద ఉదృతి కారణంగా ఇంకొల్లు-మంగలూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొణికి వద్ద వాగు ఉప్పొంగుతుండడంతో ఇంకొల్లు- ఉప్పుగుండూర్ల మధ్య రాపోకలు నిలిచిపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు




