
రుణాలు రీ షెడ్యూల్ చేయాలి
తెలంగాణ రైతులను ఆదుకోవడంలో వివక్ష : ఈటెల
ఖమ్మం, అక్టోబర్ 28 (జనంసాక్షి) :
తెలంగాణ గిరిజన గూడాల్ని ముంచే పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌ఎల్పీనేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులు రైతులకిచ్చిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు రైతులను అతలాకుతలంచేస్తే సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రి పాలకులు మాత్రం తెలంగాణను వారి పరిధిలో లేదన్న ట్లుగా వ్యవహరిస్తూ కనీస సహాయం కూడా విడుదల చేయడం లేదని ఈటెల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో పంట నష్టపోయిన పొలాలను ఎమ్మెల్యేలు పార్టీనేతలతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రకు వెళ్లి కోట్లకు కోట్లు తక్షణంగా విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ రైతులు మనుషులుగా కనిపించడం లేదా అని నిలదీశారు. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయలని డిమాండ్ చేశారు. కొత్త రుణాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. తడిచిన దాన్యంను, రంగుమారినదాన్యాన్ని కూడా ప్రబుత్వం కొనుగోలు చేయాలన్నారు. తెలంగాణ రైతులకు గడిచిన మూడేళ్లుగా రావాల్సిన ఇన్‌పుట్ సబ్సీడిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని చరిత్రలోచూడలేదన్నారు. నష్టపోయిన ఎకరా పంటకు 25వేల రూపాయల పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా టీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని రాజేందర్ హెచ్చరించారు. పాలకుల మెడలు వంచేందుకు పోరాటాలు చేస్తామన్నారు. తెలంగాణలో వర్షాలపై స్పందించి ప్రజల్లోకి వచ్చింది టిఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. పార్టీ నిర్ణయం తీసుకుని అయిదు బృందాలను నియమించగా అందరు కూడా క్షేత్రస్థాయిలోనే ఉన్నారన్నారు. రెండుమూడు రోజుల్లో అన్నింటిని క్రోడీ కరించి నివేదికను ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి, గవర్నర్‌లకు ఇస్తామన్నారు.
పోలవరాన్ని అడ్డుకుంటాం




