
సోనియాకు అండగా నిలబడదాం
జైత్రయాత్రలో డీకే అరుణ
గద్వాల, అక్టోబర్ 29 (జనంసాక్షి) :
ఎవరెన్ని ఊసరవెల్లి వేషాలు వేసినా తెలంగాణ ఏర్పాటు ఆగదని మంత్రి డీకే అరుణ అన్నారు. జగన్ ముప్పై సీట్లను, చంద్రబాబు సమన్యాయం అంటూ సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విభజన జరిగాక నీళ్ల సమస్యలు వస్తాయని చెప్పడం సరికాదన్నారు.గద్వాలలో జరుగుతన్న టీ-కాంగ్రెస్ జైత్రయాత్ర సభలో వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులపై రాష్ట్రమంత్రి డీకే అరుణ ఫైర్ అయ్యారు. 60 ఏళ్ల ఉద్యమాన్ని సాకారం చేసిన సోనియాకు ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయ మనుగడ కోసమే తెలంగాణను ఆపుతామని సీమాంధ్ర ప్రజలను జగన్, చంద్రబాబు మోసం చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచడమే జగన్ సంస్కృతి అని ఆమె విమర్శించారు. ఢిల్లీలో చంద్రబాబు ఎందుకోసం దీక్ష చేశాడో తెలియనిస్థితిలో ఉన్నాడన్నారు. తెలంగాణ రాష్ట్రం టీ కాంగ్రెస్ నేతల వల్లే వచ్చిందన్నారు. మంత్రి పదవి రానందుకే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో చేరిండని, తెలంగాణ తన వల్లే వచ్చిందని చెప్పడం కేసీఆర్‌కు తగదన్నారు. గద్వాలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జైత్రయాత్ర సభ అట్టహాసంగా ప్రారంభమైంది. సభలో ప్రసంగిస్తూ మంత్రి డీకే అరుణ అన్ని పార్టీల ఏకాభిప్రాయాన్ని తీసుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నందుకు సోనియాకు కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం కేంద్రం ఇప్పటికిప్పుడే తీసుకున్న నిర్ణయం కాదన్నారు. జైత్రయాత్ర కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, పొన్నాల తదితరులు హాజరయ్యారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను నమ్మిన మాజీ మంత్రి కొండా సురేఖ వంటి వారిని నట్టేట ముంచారని మంత్రి డికె అరుణ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్ జగన్‌ల పైన ఆమె మండిపడ్డారు. విభజనపై కాంగ్రెసు పార్టీ రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదన్నారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగు వాళ్లకు మధ్య పోరాటమని జగన్ ఇటీ-వల హైదరాబాదులో నిర్వహించిన సమైక్య సభలో అంటున్నారని, అంటే ఆయన దృష్టిలో తెలంగాణ ప్రజలు తెలుగు వాళ్లు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం వద్దా అన్నారు. రాజకీయ మనుగడ కోసమే తెలంగాణ ఆపుతామని సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్ ఎంపీగా పోటీ చేసినప్పుడు సోనియా ఇటలీ దేశస్థురాలని తెలియదా చెప్పాలన్నారు. సోనియాది ఇటలీ దేశం అని జగన్‌కు ఈ రోజు గుర్తుకు వచ్చిందా అన్నారు. కొండా సురేఖ జగన్ కోసం మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని, ఆమె భర్త ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేశారని, అలా వెంట నడిచిన వాళ్లను జగన్ నట్టేట ముంచారన్నారు. జగన్ పక్కా తెలంగాణ వ్యతిరేకి అని అర్థమైపోయిందన్నారు. ఆ పార్టీలోని తెలంగాణ నేతలు బయటకు రావాలన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడమే జగన్ లక్ష్యమా అని ప్రశ్నించారు. చంద్రబాబు విభజనపై రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు ఎడారిగా మార్చారన్నారు. అరవయ్యేళ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిందన్నారు. కెసిఆర్ ప్రజలను మభ్యపెట్టవద్దన్నారు. కాంగ్రెసు నేతల ప్రయత్నం ఫలితంగానే తెలంగాణ వచ్చిందన్నారు. అరవయ్యేళ్ల ఉద్యమంలో కెసిఆర్ కూడా పాత్ర పోషించారే తప్ప తెలంగాణ సాధ్యమైంది మాత్రం కాంగ్రెసు నేతల వల్లే అన్నారు. ప్రజలకు మేలు చేయని రాజకీయాలు మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవ్వరూ అడ్డుకోలేరు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఏఒక్కరు కూడా అడ్డుకోలేరని, అలా చేస్తామని చెప్పుకుంటూ తిరిగితే వారి భ్రమే అవుతుందని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. గద్వాలలో జరిగిన కాంగ్రెస్ జైత్రయాత్రలో ఆయన మాట్లాడారు. సిఎంతోపాటు కేంద్రమంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు ఇంకెవరైనా సరే రాష్ట్ర ఏర్పాటును ఎట్టిపరిస్థితిలో అడ్డుకోలేరన్నారు. ఎవ్వరైనా సరే అడ్డుకుంటామనే వారంతా తెలంగాణ తుఫానులో కొట్టుకు పోవాల్సిందేనని హెచ్చరించారు. కేంద్రం రోజుకు నాలుగుసార్లు ఇప్పటికి లక్షలసార్లు రాష్ట్రాన్ని విభజించడం ఖాయం అనిచెపుతున్నా కూడా మొండిగా వాదించడం వారి అవివేకమే అవుతుందన్నారు. రాష్ట్రాని విభజిస్తున్నామని చెప్పినప్పుడు ఎందుకు నోరు మెదపలేదని సీమాంధ్ర నేతలను నిలదీశారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి నేడు దుర్మార్గంగా వ్యవహరించడం వారికి నైతికత ఎలా అవుతుందో అర్థం కావడంలేదన్నారు. అలా చెపుతూ ఇప్పటికి కూడా సీమాంధ్రకు చెందిన సామాన్య ప్రజానీకాన్ని మభ్యపెట్టడమే అవుతుందని ఆరోపించారు. వాస్తవాలు చెప్పి పార్టీని ప్రజల్లో పటిష్టంచేయాలని దామోదర రాజనర్సింహ హితవు పలికారు. నిన్నటి వరకు తెలంగాణ అంశాన్ని తేల్చాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన ప్రతిపక్ష పార్టీలు యూటర్న్ తీసుకుని రాజకీయాల్లో విలువలను మంటగలిపారని ఆరోపించారు. ఒకరేమో సమన్యాయం అంటూ, మరొకరేమో సీమాంధ్రకు అన్యాయం జరిగిందని దొంగ దీక్షలు చేస్తూ, పర్యటనలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. తాము కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులమని కాలర్‌లు ఎగి రేసుకుని చెపుతున్న సీమాంధ్ర నేతలు ఏఒక్కరు కూడా సోనియాగాంధీపై వైసిపినేత జగన్ ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేసినా కూడా ఎందుకు స్పందించలేదని వాటిని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సీమాంధ్రలో జగన్‌ను తిడితే తమకు రాజకీయంగా భవిష్యత్ ఉండదనో లేక, పార్టీనుంచి అందులోకి జంప్ అవుతామనుకునే వారే అధికంగా ఉండమేకారణం కావచ్చన్నారు. టిడిపి ముమ్మాటికి సీమాంధ్ర పార్టీయేనన్నారు. పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉంటే విూపార్టీకే చెందిన సీమజిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ ఏవిధంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తాడని చంద్రబాబును ప్రశ్నించారు. ఆనాడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని సీమకోసం ప్రశ్నించినందుకే పార్టీనుంచి బయటకు పంపించిన చంద్రబాబు నేడు కేశవ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాడని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో భాగమే కేశవ్ సుప్రీం కోర్టు పిటీషన్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది మహబూబ్‌నగర్ జిల్లాయేనన్నారు. కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది కాబట్టే తాము తెలంగాణ జిల్లాల్లో జైత్రయాత్రలు పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తమను ఏపార్టీ కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇంత కాలం చెప్పినట్లుగానే ఇచ్చేది మేమే తెచ్చేది మేమే లేకుంటే చచ్చేది కూడా మేమేనని గర్వంగా చెప్పుకు వచ్చామని డిప్యూటిసిఎం పేర్కొన్నారు. ఈతరుణంలో తాము కచ్చితంగా ప్రజలకు చెప్పుకునే అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 60ఏళ్ల సుదీర్ఘ కాలంనాటి ఆకాంక్షన్నారు. తెలంగాణ సునామిలో కిరణ్‌తోపాటు లగడపాటి, జగడపాటి, కావూరి, రాయపాటి ఇలా ప్రతిఒక్కరు కూడా కొట్టుకు పోవాల్సిందేనని దామోదర రాజనర్సింహా హెచ్చరించారు.




