పాలెం వద్ద ఘోరం


ఆశలు బూడిది చేసిన వొల్వో
బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనం
డ్రైవర్‌, క్లీనర్‌ సహా బతికి బయటపడ్డ ఐదుగురు
ప్రైవేట్‌ బస్సులను నియంత్రిస్తాం : బొత్స
ఉస్మానియా మార్చురీకి శవాలు
డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతుల గుర్తింపు
మహబూబ్‌నగర్‌, అక్టోబర్‌ 30 (జనంసాక్షి) :
మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద ఘోరం జరిగింది. బెంగళూర్‌ నుంచి హైదరాబాద్‌కు దీపావళి పండుగ కోసం ఉత్సవాలు జరుపుకునేందుకు గాను వోల్వో బస్సులో 50 మంది యువతీ యువకులు, వ్యాపారులు గతరాత్రి 10.30గంటలకు బయలుదేరారు. సరిగ్గా మరో గంట సేపట్లో హైదరాబాద్‌ చేరాల్సి ఉండగా 5.30 గంటలకు కొత్తకోట మండలం పాలెంవల్ల అతి వేగంగా రావడం వల్ల రోడ్డుప్రక్కనున్న కల్వర్ట్‌ను ఢీకొంది. దీంతో డీజిల్‌ ట్యాంక్‌ పగిలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈఘటన సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. భారీ శబ్దం రావడంతో తేరుకుని చూసే సరికే అంతా జరిగిపోయింది. బస్సు ముందు ఓకారు ముందుండగా వోల్వోబస్సు మంటలు చలరేగుతున్న సంఘటనను చూసి చలించిపోయి నిలిపివేసి వెనక్కి వచ్చి డ్రైవర్‌, క్లీనర్‌తోపాటు అయిదుగురిని మాత్రం గాయాలతో రక్షించ గలిగారు. వీరిని అదే కారులో వారిని తీసుకుని తొలుత సవిూపం లోని వనపర్తి ఆసుపత్రికి తరలించారు. కొద్ది క్షణాల్లోనే మంటలు వేగంగా విస్తరించడం కిటికీలు రాకపోవడంతో ప్రయాణీకులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆసమయంలో ప్రత్యక్ష సాక్షులు పెద్దగా లేకపోవడం విశేషం. ప్రమాదాన్ని గుర్తించిన కారు ప్రతినిధులు మిగతా వ్యవహారాల జోలికి పోకుండా గాయపడ్డ వారిని తీసుకుని వెల్లిపోయారు. ఆతర్వాత గ్రామానికి చెందిన వారు సంఘటన స్థలానికి చేరుకోవడం జిల్లా పోలీసులకు, ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. గాయపడిన డ్రైవర్‌ సైతం హైదరాబాద్‌కు చెంది జబ్బార్‌ ట్రావెల్స్‌ యజమానికి ఫోన్‌ చేసి సమాచారం తెలిపారు. బస్సులో 40 సీటింగ్‌ కెపాసిటీ ఉన్నప్పటికి మధ్యలో మరో పదిమంది ఎక్కారని తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన వారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న వారి పూర్తి వివరాలు ట్రావెల్స్‌ వద్ద లేవనేది తేలిపోయింది. 33 మంది పేర్లు మాత్రమే ఉన్నాయని మిగతా వారి సంగతి మాకు తెలియదని చేతులెత్తేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని కలెక్టర్‌ గిరిజాశంకర్‌, ఎస్పీ నాగేంద్ర కుమార్‌, డిఐజి, మంత్రి డికె అరుణ, ఇతర ప్రజాప్రతినిధులు, ఆసుపత్రికి చెందిన వైద్యులు, సిబ్బంది సైతం 108 వాహనాలను తీసుకుని చేరుకున్నారు. అయితే కేవలం 30మంది శవాలను మాత్రం బయటకు తీయగలిగారు. మరికొందరి తలలు తెగిపడిపోవడం, కాళ్లు పూర్తిగా కాలకపోవడం కనిపించింది. సంఘటన చూస్తే ప్రతిఒక్కరి హృదయాలు కలిచి వేసేలా దృశ్యాలున్నాయి.అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం సేకరించిన వారి పేర్లను పోలీసులు, జిల్లాకలెక్టర్‌ ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని నెలకొల్పారు. మూడు ఫోన్‌ నంబర్లను అందుబాటులోఉంచారు. గాయాలపాలైన వారిని తొలుత వనపర్తి ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత హైదరాబాద్‌లోని డిఆర్‌డిఓ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పేర్లను మహబాబ్‌నగర్‌ జిల్లా అధికారులు ప్రకటించారు. శ్రీకర్‌ (హైదరాబాద్‌), రాజేశ్‌(హైదరాబాద్‌), జైసింగ్‌ (ఉత్తరప్రదేశ్‌), మజహర్‌ భాషా (బెంగళూర్‌), జోగేశ్‌(బెంగళూర్‌)లు గాయాల పాలయ్యారు. డ్రైవర్‌తోపాటు క్లీనర్‌లు మాత్రం పరారీలో ఉన్నారు. వారు కూడా క్షేమం గానే ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సంఘటన స్థలం అంతా ఆర్తనాదాలతో నిండిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న వారి శవాలను కనీసం గుర్తించే పరిస్థితి లేకుండా ఉండడంతో ఏవిధంగా తీసుకెళ్లాలి ఎవరె వరున్నారనే సమాచారం కోసంతంటాలు పడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మంత్రి డికె అరుణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్నప్పటికి వెంటనే జిల్లా మంత్రి డికె అరుణతోపాటు, ఇంచార్జ్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్‌, ఎస్పీలతో పోన్లో మాట్లాడి సహాయక చర్యల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని హుకుం జారీచేశారు. వరద బాధితుల పరామర్శించే కార్యక్రమంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. స్థానికటిడిపి నేతలతో మాట్లాడి సహాయకచర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. సంఘటనపై దిగ్బాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జబ్బార్‌ ట్రావెల్స్‌ కార్యాలయం వద్ద పలువురు చేరుకుని బస్సులో ఉన్నవారి పేర్లను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రిజర్వేషన్ల సమయంలో ప్రయాణికులు రిజర్వ్‌ చేసుకున్న ప్రకారమే తాను తీసుకుని వచ్చామంటున్నారు. అయితే ఈ ఎపి 02 టిఎ 0963 నంబర్‌ బస్సు మాత్రం జేసి దివాకర్‌ రెడ్డి పేరుపైన రిజిష్టర్‌ అయినట్లు తెలుస్తోంది.  సంఘటనా స్థలంలోనే వైద్యులు కాలిపోయిన వారి శవాలకు పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలానికి చనిపోయిన వారి బంధువులు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బస్సు ప్రమాదాల్లో మృతులందరిదీ ఒక్కో కథ
మహబూబ్‌ నగర్‌ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదంగా ఉంది.  హైదరాబాద్‌ చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న అనిల్‌ సింగ్‌ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. అనిల్‌ సింగ్‌ కుమారుడు అక్షయ్‌ సింగ్‌ ఈ ప్రమాదంలో అసువులు బాశాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న అక్షయ్‌ సింగ్‌ ఈ నెల 26న తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌ రావాల్సి ఉంది. అప్పుడు వాయిదా వేసుకుని దీపావళి పండుగకు హైదరాబాద్‌ కు ప్రయాణమయ్యాడు. ఇంతలోనే బస్సు ప్రమాదం రూపంలో మృత్యువు అతడిని కబళించింది. అక్షయ్‌ సింగ్‌ తండ్రి చిక్కడపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఇక్కడ పనిచేస్తున్నారు. అక్షయ్‌ సింగ్‌ మృతితో చిక్కడపల్లిలోని అతని నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. దీపావళి పండుగ వేళ సొంత వూరికి వస్తున్న వారు గమ్యం చేరుకోకుండానే బస్సు రూపంలో మృతువాత పడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి మండలం దేవుని పల్లి గ్రామానికి చెందిన కుసుమ వేదపతి ఉన్నారు. సాప్ట్‌వేర్‌ ఇంజనీరుగా పని చేస్తున్న వేదపతికి 11 నెలల క్రితమే స్వర్ణలత అనే యువతితో వివాహం అయింది. పండగకు వస్తానని ఫోన్‌ చేసి ఇంట్లో వారికి చెప్పారు. ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు, భార్యకు ప్రమాద సమాచారం తెలిసి కుప్పకూలిపోయారు. వేదపతి మరణించాడని తెలిసి గ్రామంలో విషాదం నెలకొంది. వోల్వో బస్సు ప్రమాదం కరీంనగర్‌ జిల్లా పెగడపల్లి మండలం నంచర్లలో విషాదాన్ని నింపింది. నంచర్లకు చెందిన విట్టు అమరేందర్‌ బెంగళూరు క్యాప్‌జెమిని సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి గతేడాది జగిత్యాలకు చెందిన నర్మదతో వివాహమైంది. దీపావళి సందర్భంగా అమరేందర్‌ స్వస్థలానికి బయలుదేరాడు. అనుకోకుండా బస్సు ప్రమాదానికి గురవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం నర్మద గర్భవతి కావడంతో ఆమెకు భర్త మరణించిన విషయం తెలియజేయలేదు. ప్రస్తుతం అమరేందర్‌ మృతితో బంధువుల్లో తీవ్ర విషాదం నింపింది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటాడనుకుంటే ఊహించని విధంగా మృత్యు ఒడికి చేరాడని, తమకింక ఎవరు దిక్కంటూ మృతుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. బెంగళూరులో ఉంటున్న సుందర రాజు, అతని భార్య ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరచూ వస్తుంటారు. ఆ క్రమంలోనే మంగళవారం రాత్రి బెంగళూరులో జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సులో హైదరాబాద్‌కు బయలు దేరారు. అయితే మార్గ మధ్యంలోనే ప్రమాదం జరిగి  భార్యభర్తలిద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే మృతులు సుందరరాజు స్వగ్రామం తాళ్లూరులోనూ, అతని భార్య సొంతూరు రావి పాడులోనూ విషాద చాయలు అలముకున్నాయి. ఈ రోజే వీరి పెళ్లిరోజు కూడా కావడంతో అది తలచుకుని బంధువులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. వీరిరువురూ గత నాలుగు సంవత్సరాలుగా కూతురి చదువు నిమిత్తం బెంగళూరులో నివాసముంటున్నారు. నెలకొకసారి వైద్యపరీక్షలు, మందుల కోసం దంపతులిద్దరూ హైదరాబాద్‌ వస్తుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం బెంగుళూర్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విజయ మేరి తల్లితండ్రులు సైతం 1989లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలోనే మరణించినట్లు సమాచారం.
ప్రైవేట్‌ బస్సులకు కళ్లెం: బొత్స
హైదరాబాద్‌ : ప్రైవేట్‌ బస్సుల ఆగడాలకు కళ్లెం వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రమాదాలు మళ్లి జగరకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందారని చెప్పారు. ఇందులో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని వివరించారు. మహబూబ్‌నగర్‌ ప్రమాద ఘటన నేపథ్యంలో బుధవారం ఆయన రవాణా శాఖ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి లక్ష్మీపార్థసారథి, కమిషనర్‌ అనంతరాము తదితరులు హాజరయ్యారు. బస్సు ప్రమాదం నేపథ్యంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులపై తీసుకోవాల్సిన చర్యలపై సవిూక్షించారు. గతంలో షిర్డీ నుంచి వస్తున్న బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా మృతి చెందిన నేపథ్యంలో నిర్వహించిన తరహాలోనే మరోమారు ప్రైవేట్‌ బస్సులను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో చిన్నారి సహా 45 మంది మృతి చెందారని తెలిపారు. ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని వారు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రయాణికులు వివరాలు, ఫోన్‌ నెంబర్లు అందాయని, హెల్ప్‌లైన్‌ ద్వారా బాధితులకు సమాచారం అందిస్తున్నామని వివరించారు. మృతదేహాలన్నీ గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని వాటిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు బస్సు దివాకర్‌ ట్రావెల్స్‌ పేరుపై నమోదై ఉందని, జబ్బార్‌ ట్రావెల్స్‌ లీజుకు తీసుకొని నడుపుతోందని చెప్పారు. ప్రమాదానికి గురైన బస్సు పత్రాలు అన్నీ సక్రమంగానే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని బొత్స తెలిపారు. జబ్బార్‌ ట్రావెల్స్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకొనే ముందు ప్రయాణికుల వైపు నుంచి కూడా ఆలోచిస్తామని తెలిపారు. డ్రైవర్లపై నియంత్రణ చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. చట్టంలో లేని కొన్ని అంశాలపైనా దృష్టి సారిస్తామన్నారు. ముఖ్యమంత్రి శ్రీకాకుళం పర్యటన నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత బాధితులకు సాయం అందించే అంశంపై చర్చిస్తామని తెలిపారు.
జాతీయ రహదారిపై ఆర్తనాదాలు
మృతుల కుటుంబంలో జడ్జి కుమార్తె
పాలెం వద్ద  అగ్ని ప్రమాదంలో కాలి బూడిదై పోయిందని తెలుసుకున్న నేతలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ప్రయత్నించారు. తొలుత జిల్లా కలెక్టర్‌ గిరిజాశంకర్‌, ఎస్పీ నాగేంద్ర కుమార్‌తోపాటు మంత్రి డికె అరుణ, టిఅర్‌ఎస్‌ నేతలు జూపల్లి కృష్ణారావు, జితేందర్‌ రెడ్డి ఉదయమే చేరుకుని అక్కడే మకాం వేశారు. అనంతరం కొత్తకోట ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, సిపిఐ, సిపిఎం, బిజెపినేతలు ఒక్కరొక్కరుగా చేరుకున్నారు. కృష్ణా జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తున్న కార్యక్రమంలో ఉన్న టిడిపి అదినేత ఫోన్‌లో అధికారులతో పార్టీ నాయకులతో మాట్లాడారు. హైదరాబాద్‌నుంచి తన కుమారుడు లోకేష్‌ను హుటా హుటిన వెళ్లాలని ఆదేశించడంతో ఆయన పదిగంటల కల్లా చేరుకున్నారు. బిజెపికి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు చేరుకుని అధికారుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల కుటుంబాలను ఓదార్చేందుకు ప్రయత్నించారు. నాయకుల రాకతో హైవేపై హడావుడి ఎక్కువగా కనిపించింది. సంఘటనతో యావత్‌ రాష్ట్రం మొత్తాన్ని విషాదంలో మునిగి పోయింది. రోడ్డు పక్కనే టెంట్‌ వేసి డిఎన్‌ఎ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా ఎస్సీఎస్టీ అట్రాసిటీస్‌ కోర్టు జడ్జి మోహన్‌రావు కుమార్తె ప్రియాంక కూడా దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. ఆ న్యాయమూర్తి కూడా సంఘటనా స్థలానికి చేరుకుని తన కూతురి మృతదేహాం కోసం ఆర్తనాదాలు పెట్టడం తీవ్రంగా కలిచి వేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత మహబూబ్‌నగర్‌ ఎంపిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాత్రం ఉదయమే దిగ్భ్రాంతి వ్యక్తం చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు సంఘటనా స్థలంలో వినిపించాయి.

జబ్బార్‌ ట్రావెల్స్‌ అధినేత నయీం అరెస్ట్‌

బస్సు ఘటనకు కారణమైన ట్రావెల్స్‌కు చెందిన యజమాని నయీంను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని మహబూబ్‌నగర్‌కు తరలించారు. కనీసం రికార్డులు లేకుండా నడిపించడం దుర్మార్గమని పోలీసులు హెచ్చరించారు. ఈ బస్సు 2012 నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కూడా తీసుకోలేదని ఆర్టీఏ రికార్డులు తెలుపుతున్నాయి. మూడు నెలలకోసారి ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉన్నాకూడా రెండు సంవత్సరాలుగా టాక్స్‌చెల్లించక పోవడం దుర్మార్గం అని పోలీసులు సీరియస్‌గా గుర్తించారు. వివిధ పన్నుల రూపంలో 11 లక్షలరూపాయలు చెల్లించాల్సి ఉందని ఆర్టీఏఅధికారులు పేర్కొన్నారు. అయితే తాము గతంలోనే ఇన్‌యాక్టివ్‌ బస్సుగానే రికార్డునమోదు చేశామని అధికారులు తెలిపారు. ఫిట్‌నెస్‌ లేని బస్సు 500 కిలోవిూటర్ల దూరం నడిపించడం దుర్మార్గమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా జబ్బార్‌ ట్రావెల్స్‌ యజమానిని అరెస్ట్‌ చేసిన పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకెల్లారు. అక్కడి పోలీస్‌ స్టేషన్‌లోఉన్న డ్రైవర్‌, క్లీనర్‌లతోపాటు విచారించిన తర్వాత సాయంత్రానికి అరెస్ట్‌ చూపిస్తారని తెలుస్తోంది.
బస్సు ప్రమాదంపై అనేక అనుమానాలు.. పొంతనలేని కథనాలు
జబ్బర్‌ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదంపై పలు రకాలు వాదనలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  డ్రైవర్‌ నిర్లక్ష్యం.. సమయస్ఫూర్తి లేకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. బస్సులో మొత్తం 49మంది ప్రయాణించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా వీరిలో 45 మంది చనిపోయారు.  డ్రైవర్‌, క్లీనర్‌ తో  పాటు మరో అయిదుగురు ప్రాణాలుతో బయటపడ్డారు. కాగా డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నాడా అనే అనుమానంతో వైద్యులు అతని రక్త నమునాలు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ పంపించారు. ఇక బస్సులో పెద్ద ఎత్తున ఊలు బయటపడటంతో బస్సులో సరుకు రవాణాపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాలు అమాయక జనం నిస్సహాయతను సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వెరసి ప్రజల  ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.  ప్రైవేట్‌ బస్సెక్కిన ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలే. కరెన్సీతో కళ్లుమూసుకుపోయి చూసిచూడనట్టుగా వదిలిస్తున్న అధికారులు ప్రజాభద్రతను బాధ్యత వహించాల్సిన పాలకులు కూడా  బాధ్యతా రహిత్యంగా వ్యవహరిస్తుంటే సామాన్యులు ప్రాణాలు వోల్వో బస్సుల్లో బూడిదై పోవాల్సిందే. మంగళవారం రాత్రి 10 గంటలకు బెంగళూరులో బయల్దేరింది. ఇది బుధవారం ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవాలి. ఇంకో రెండు గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవాల్సి ఉండగా ఘోరం జరిగింది. మహబూబ్‌ నగర్‌ జిల్లా కొత్తకోట మండలంలో ఉన్న పాలెం అనే గ్రామానికి సవిూపానికి రాగానే మృత్యుదేవత బస్సును ఆవహించింది. ఉదయం నాలుగున్నర గంటలు దాటిన తర్వాత బస్సు ముందు ఉన్న కారును ఓవర్‌టేక్‌ చేసింది. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన కల్వర్టును ఢీకొట్టింది. ఈ సమయంలో భారీ కుదుపు వచ్చింది. దాంతో బస్సులోని డీజిల్‌ ట్యాంకు తీవ్రమైన ఒత్తిడి కలిగింది. ఒత్తిడి ఎక్కువయి ట్యాంకులో మంటలు రేగాయి. ఈ మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి.  డ్రైవర్‌ చెబుతున్న దాని ప్రకారం బస్సు కల్వర్టును ఢీకొట్టడం వల్ల ముందు టైర్‌ పగిలిపోయింది. దీంతో బస్సు భారీ కుదుపునకు లోనయింది. ఈ క్రమంలో డీజిల్‌ ట్యాంకులో మంటలు లేచాయి. బస్సులో మంటలు లేచిన తీరును భిన్నమైన కథనాలు వస్తున్న నేపథ్యంలో ప్రమాదం కచ్చితంగా ఎలా జరిగింది? అనే విషయాన్ని నిపుణులు తేల్చాల్సి ఉంది. బస్సులో మంటలు లేచిన విషయాన్ని డ్రైవర్‌ క్యాబిన్లో ఉన్న వారు గుర్తించారు.  డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ కూడా కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. డ్రైవర్‌ క్యాబిన్‌కు, ప్రయాణికులు ఉన్న పోర్షన్‌కు మధ్యలో ఉన్న డోర్‌ తెరుచుకోలేదు. ఈ డోర్‌ గనుక తెరుచుకుని ఉంటే కొంత మంది ప్రయాణికులు అయినా ప్రాణాలతో బయటపడి ఉండేవారు. డోర్‌ తెరుచుకోకపోవడం గాఢ నిద్రలో ఉండటం వల్ల ప్రయాణికులకు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి దారి లేకుండా పోయింది. మంటలు వచ్చిన విషయాన్ని గుర్తించే సరికి పొగ, మంటలు దట్టంగా వ్యాపించాయి.  ఏసీ గ్యాస్‌ వల్ల కూడా మంటలు శరవేగంగా వ్యాపించాయి. ఒకరిద్దరు ప్రయాణికులు కాలుతున్న శరీరాలతోనే కిందకు దూకేశారు. అయినా ప్రాణాలు దక్కించుకోలేకపోయారు.  ఇప్పటికీ బస్సులో ఎంత మంది ఉన్నారు? అనే దానిపై ఇంకా స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు.
ఘటనలో లోటుపాట్లు
సుదూర ప్రాంతానికి ఒకరే డ్రైవర్‌

ఇన్‌యాక్టివ్‌ బస్సును నడపడం కారణమే

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెంవద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో లోటు పాట్లు చాలానే కనిపిస్తున్నాయి. బెంగుళూర్‌నుంచి హైదరాబాద్‌ అనేది దగ్గరి ప్రయాణం కానేకాదనేది వాస్తవం. అయితే ఇంత దూరం బస్సును నడిపేందుకు ట్రావెల్స్‌ సంస్థలు ఇద్దరు డ్రైవర్లను వినియోగించాల్సి ఉన్నా కేవలం ఒక్క డ్రైవర్‌తోనే నడిపించినట్లు తేలిపోయింది. ఒక్క డ్రైవర్‌ కావడంతో రాత్రంతా బస్సు నడిపించడం వల్ల తెల్లవారు జామున నిద్రమబ్బుకు రావడంతో కంటివిూద కునుకు రావడం వల్ల బస్సు ఎడమవైపుకు లాక్కెల్లడం అతివేగంగా ఉండడం వల్ల కల్వర్ట్‌ను ఢీకొంది. దీంతో వోల్వో ఏసి బస్సు కావడంతో డీజిల్‌ ట్యాంక్‌ పగిలిపోయి వెంటనే మంటలు లేచినట్లు తెలుస్తోంది. బస్సులో 40 సీటింగ్‌ కెపాసిటీ అయినా మరో పదిమందిని ఎక్కువగా ఎక్కించుకోవడం వల్ల బస్సుపై లోడ్‌ కూడా ఎక్కువగానే ఉండి ఉంటుందని తెలుస్తోంది. 49మంది ప్రయాణీకులతోపాటు డ్రైవర్‌, క్లీనర్‌లున్నారు. తెల్లవారు జామున సరిగ్గా 5.30గంటల సమయంలో అతి వేగంగా అంటే 120 నుంచి 180 కిలోవిూటర్ల వేగంతో బస్సు ఉన్నట్లు తెలుస్తోంది. కల్వర్ట్‌ను ఢికొట్టడంతో మెయిన్‌ డోర్‌లాక్‌ విరిగిపోయిలాక్‌ అయిపోయిందని తెలుస్తోంది. ప్రయాణీకులు బయటకు వచ్చే అవకాశాలు లేక పోవడంతో అందులో కాలి బూడిదై పోయారు. ఒకరిద్దరు మాత్రమే డ్రైవర్‌ సీటునుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు కూడా జబ్బార్‌ ట్రావెల్స్‌గా పేర్లు రాసుకున్నప్పటికి ఇది దివాకర్‌ ట్రావెల్స్‌ పేరుతో రవాణా శాఖలో రిజిష్టర్‌ అయినట్లు తెలుస్తోంది. 2010లో అనంతపురంలో రిజిష్టర్‌ అయింది. బస్సులో పత్తి బేల్లను కూడా ఉంచడం వల్లే మంటలు త్వరగా విస్తరించాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎపి 02టిఎ 0963 బస్సు జేసిదివాకర్‌ ట్రావెల్స్‌ పేరున రిజిష్టర్‌ అయింది. అయితే గత ఏడాదిగా జబ్బార్‌ ట్రావెల్స్‌ సంస్థకులీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఈబస్సును రవాణా అధికారులు కూడా ఇన్‌యాక్టివ్‌గా రికార్డుల్లో నమోదైంది. దీనికి తోడు హైవె నిర్మాణంలో కూడా లోటుపాట్లు కొట్టొచ్చినట్లుగానే ఉన్నాయి. రోడ్డు మలుపు వద్ద జాతీయ రహదారిపై ఎంతైతే వెడల్పు ఉండాలో అంత లేకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది. ఎలాంటి ప్రమాద హెచ్చరికలుగాని, సైన్‌బోర్డులుగాని బిగించక పోవడంతో డ్రైవర్లకు కల్వర్ట్‌ల సమాచారం తెలియకుండా పోతోంది. రోడ్డు నిర్మాణం సమయంలో గ్రామాల ప్రజలు అనేక సార్లు కర్వ్‌లను సరిచేయాలని డిమాండ్‌ చేసినప్పటికి పట్టించుకున్న పాపానపోక పోవడంతో ఈదుర్గటన చోటుచేసుకుందని తెలుస్తోంది. అంతే కాక బస్సులో ఉన్న ప్రయాణీకులపేర్లు కూడా సమగ్రంగా లేక పోవడంతో బంధువుల రోధనలకు అర్థం లేకుండా పోతోంది. మృతులశవాలను కూడా కనీసం గుర్తు పట్టే పరిస్థితి లేకుండా ఉండడంతో ఎలా ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారు మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకువస్తుంటే వాటిని గుర్తు పట్టడం చాలా కష్టంగానే మారిపోయింది. నలుగురైదుగురి తలలైతే మొండెం నుంచివిడిపోయి ఉన్నట్లుగా కూడా సహాయక సిబ్బందిగుర్తించారు. సంఘటనా స్థలానికి సవిూపంలో అగ్నిమాపక కేంద్రం కూడా లేకపోవడం మరో కారణంగా కూడా చెప్పవచ్చు. అగ్నిప్రమాదం జరిగిందనే విషయాన్ని తెలిపేందుకు అగ్ని మాపక యంత్రం సవిూపంలో లేకపోవడం కూడా మంటలను ఆపే ప్రయత్నాలు జరుగలేదని తెలుస్తోంది. బస్సు ఏసి వోల్వోది కావడంతో కిటికీలు పగులగొట్టే పరిస్థితిలో లేకపోవడంతో అందులోనే కాలి బూడిద కావాల్సిన దుస్థితి నెల కొంది. సమయం గడిచిన కొద్ది లోటు పాట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
మృతులు వీరే : మహమ్మద్‌ ఆసీఫ్‌(35), ఫణి కుమార్‌(28), శక్తికుమార్‌(28), అమీర్‌, రోహియా, రామానుజ దినేష్‌, వేదపతి (27), అడారి రవికుమార్‌ (27), జ్యోతి(33), ప్రశాంత్‌ గుప్తా(23), మొహిద్దీన్‌(21), వెంకటేష్‌(45), చంద్రశేఖర్‌(41), గౌరవ విక్రాంత్‌ రాయ్‌ కిరణ్‌(30), అజహర్‌(41), శ్రీకృష్ణ (36), హజ్మతుల్లా, గాలి మేరి విజయ్‌కుమారి (50), గాలి బాలసుందర్‌రాజు(54), షోయబ్‌, గౌరవ్‌ , విక్రమ్‌ రాయ్‌(30), అక్షయ్‌, రఘువీర్‌, జమాలుద్దీన్‌, సురేష్‌బాబు, మహ్మద్‌ సర్దార్‌, ప్రియాంక, మంజునాథ, పి.ఎన్‌. ఆర్‌ రాజేష్‌, గిరిధర్‌, ఫరుకాలి, అశుతోష్‌, సోనూ, యువరాజ్‌, ఉమర్‌, పుటియా(28), రామరాజు దినేష్‌ (30), సురేంద్ర రాజు, అఖిలేష్‌సింగ్‌,  నాగప్ప, రేణున, కిరణ్‌.
క్షతగాత్రుల వివరాలు :
శ్రీకర్‌ పద్మారావునగర్‌ (సికింద్రాబాద్‌), రాజేష్‌ బీహెచ్‌ఈఎల్‌ ఓల్డ్‌ ఎమ్‌ఐజీ (ఇన్ఫోటెక్‌ ఉద్యోగి), యోగేష్‌ గౌడ బెంగళూర్‌ (టోలిచౌకి), మాదాపూర్‌ గోల్ప్‌ కోర్ట్‌ కోచ్‌, జైసింగ్‌ (ఉత్తరప్రదేశ్‌) భాషా(బెంగళూర్‌). గాయపడిన విరికి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక బస్సు డ్రైవర్‌, క్లినర్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతదేహాలు గుర్తు పెట్టడానికి వీలు లేనంతగా కాలిపోవడంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహణ ద్వారా గుర్తించి బంధువులకు అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు.