Monday, 2 November 2026

మూడో కూటమికి అంకురార్పణ


మతోన్మాదమే ప్రమాదకరం
14 పార్టీల తీర్మానం
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 30 (జనంసాక్షి) :
దేశంలో మతోన్మాద రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా 14 పార్టీలు మూడో కూటమి ఏర్పాటుకు నాంది పలికాయి. మతోన్మాదం దేశానికి ప్రమాదకరమని, ఆ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం, సమైక్యత పరిరక్షణ రాజకీయ శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయా పార్టీలు కోరాయి. ఈమేరకు మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆ పార్టీలు తీర్మానం చేశాయి. బుధవారం ఢిల్లీలోని తల్‌టోకరా స్టేడియంలో సమాజ్‌వాదీ పార్టీ, వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. కన్వెన్షన్‌ ఫర్‌ పీపుల్స్‌ యూనిటీ అండ్‌ ఎగెయినెస్ట్‌ కమ్యూనిజం పేరుతో సభ నిర్వహించాయి. ప్రస్తుతం దేశంలో మతోన్మాద శక్తులు మరోసారి మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయని, రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మతపరమైన ప్రచారం ఊపందుకుందని, దాని ఫలితంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ముజఫర్‌నగర్‌ దాడులు ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మతవాదులను ఎదుర్కొనేలా ప్రజలను ఏకం చేసేందుకు లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. దేశం ప్రస్తుతం మతశక్తుల నీడలో ఉన్నదని, దాని నుంచి ప్రజలను రక్షించడం, వారిని సమైక్య పరచడం ద్వారా ఆ శక్తులను ఎదుర్కోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *