Monday, 2 November 2026

అఖిల భారత సర్వీసుల్లో గులాంగిరి వద్దు


నిర్ణీతకాలం వరకూ బదిలీలు చేయొద్దు
రాజకీయ నేతల మౌఖిక ఆదేశాలు పాటించాల్సిన పనిలేదు
సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) :
అఖిల భారత సర్వీసుల్లో రాజకీయ ప్రాబల్యం తగ్గించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నడుం బిగించింది. రాజకీయ బాసు ల మౌఖిక ఆదేశాల మేరకు అధికారులను బదిలీ చేసే ప్రక్రియకు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టింది. బ్యూరోక్రసీలో సంస్కరణల్లో భాగంగా గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ నేతలు చెప్పినట్లు ఉన్నతాధికారు లు నడుచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నిర్ణీత కాలంలోగా ఉన్నతాధికారులను బదిలీ చేయరాదన్న నిబంధనను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.  అధికారుల బదిలీ, పదోన్నతలు, క్రమశిక్షణ విషయంలో కొత్త చట్టం తేవాలని స్పష్టం చేసింది. 3 నెలల్లో ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాజకీయ జోక్యంతో అధికారుల పనితీరు క్షీణిస్తోందని.. నిర్నీత కాలం వరకు అధికారులను బదిలీ చేయకుండా ఉంటే వారిలో పాలనా సామర్థ్యం మెరుగుపడుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజకీయ నేతలు చెప్పినట్లు ఉన్నతాధికారులు నడుచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, బదిలీ, క్రమశిక్షణ చర్యల విషయంలో కొత్త చట్టం తీసుకురావాలని జస్టిస్‌ కేఎస్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఉద్యోగ విధుల్లో రాజకీయ నేతల జోక్యం అధికారుల పనితీరు క్షీణిస్తోందని వ్యాఖ్యానించింది. రాజకీయ నేతల మౌఖిక ఆదేశాలను ఉన్నతాధికారులు పాటించాల్సిన అవసరం లేదని కేవలం లిఖితపూర్వకంగా వచ్చే ఆదేశాలను మాత్రమే పాటించాలని సూచించింది. నిర్ణీత కాల వ్యవధి వరకు అధికారులను బదిలీ చేయకుండా ఉంటే వారిలో పాలనా సామర్థ్యం మెరుగుపడుతుందని, తద్వారా మంచి పాలన అందుతుందని జస్టిస్‌ పీసీ ఘోష్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మూడు నెలల్లో జారీ చేయాలని ఆదేశించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో సివిల్‌ సర్వీసెస్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *