Monday, 2 November 2026

ఖమ్మం జిల్లాలో ధూం తడాఖ


విజయమ్మకు చుక్కలు చూపిన పోరుబిడ్డలు
సమైక్యదేవ్‌కు చెప్పల్‌ కా పూజ
క్యాన్వాయ్‌పై కోడిగుడ్లు
అడుగడుగునా మార్మోగిన జై తెలంగాణ
వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలిని వెనక్కు పంపిన పోలీసులు
ఖమ్మం, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజలను వంచిస్తూ సమైక్య జపం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు తెలంగాణవాదులు తమ ధూం తడాఖ చూపించారు. వరద బాధితులను పరామర్శించే పేరుతో తెలంగాణ ప్రాంతంలో పర్యటనకు సిద్ధపడ్డ ఆమెను అడుగడుగునా అడ్డుకున్నారు. ఆమె వాహనం పైకి దూసుకువచ్చి చెప్పులతో కొట్టారు. క్యాన్వాయ్‌పై కోడిగుడ్ల వర్షం కురిపించారు. అడుగడుగునా జై తెలంగాణ అని నినదిస్తూ తెలంగాణ వాదం సత్తా చాటారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆమెను అడ్డుకున్న పోలీసులు వెనక్కు పంపించారు. కృష్ణా జిల్లా నుంచి పదుల సంఖ్యలో వాహనాల కాన్వాయ్‌తో ఖమ్మంజిల్లా కొణిజెర్లకు చేరుకోగానే తెలంగా ణవాదులు ఆమె కాన్వాయ్‌పైన కోడి గుడ్లను విసిరి నిరసన వ్యక్తం చేశారు. గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.తెలంగాణ వ్యతిరేకి అయిన వైసిపికిస్థానం లేదని, తమ రైతులను పరామర్శించే నైతికహక్కు కూడా  వైసిపికి లేదని ఆందోళనకారులు నినాదాలు చేశారు. దీంతో ఆమె కొణిజెర్లలో పత్తిపంటను పరిశీలించేందుకు వాహనం దిగీ దిగకుండా రెండునిమిషాల్లో కార్యక్రమం ముగించుకుని ముందుకు వెళ్లిపోయారు.అయితే కోడి గుడ్లు వేసిన అయిదుగురు తెలంగాణ వాదులను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఖమ్మం అర్బన్‌ మండలం వెంకటాయ పాలెం గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఈక్రమంలో కూడా విద్యార్థులు పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చి విజయమ్మకు వ్యతిరేకంగా నినాదాలిచ్చి కాన్వాయ్‌ను అడ్డు కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విజయమ్మ పర్యటన ఉద్రిక్తంగా మారింది. అడుగడుగునా ప్రజలు అడ్డుతగిలారు. ఆమె వాహన శ్రేణిపై కోడిడుడ్లతో దాడి  చేశారు. దీంతో పరిస్తితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గురువారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా పైనంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తరలించారు. పర్యటన వద్దని చెప్పినా కూడా ఆమె వినకపోవడంతో అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. కేవలం ఉద్రిక్తతలు తగ్గించడానికే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వైయస్‌ విజయమ్మ వరద ప్రభావిత ప్రాంతాలలో గురువారం పర్యటిస్తుండగా అడుగడుగునా ఆమెకు తెలంగాణ సెగ తగిలింది. కొణిజెర్లలో తెలంగాణవాదులు ఆమె కాన్వాయ్‌ పైన కోడిగుడ్లు విసిరారు. అనంతరం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చేరుకున్న విజయమ్మ అక్కడ మనస్సాక్షిగా చెబుతున్న విభజన జరగదని చెప్పారు. విజయమ్మ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను పలుచోట్ల అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అడ్డంకుల నేపథ్యంలో అధికారులు ఆమెకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కూడా ఇచ్చారు. పైనంపల్లి వద్దకు చేరుకున్నాక పలువురు తెలంగాణవాదులు ఆమెను అడ్డగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు విజయమ్మను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేశారు. దానిని నిరసిస్తూ విజయమ్మ, పార్టీ కార్యకర్తలు రోడ్డు పైనే బైఠాయించారు. మరోవైపు తెలంగాణవాదులు వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు విజయమ్మను అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులే అడ్డుకోవడాన్ని విజయమ్మ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని తాము కోరుకుంటున్నాం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *