Tuesday, 3 November 2026

రాష్ట్ర అవతరణ వేడుకలు ఇక ఉండవేమో!


పరిస్థితి అనిశ్చితంగా ఉంది
తెలుగుతల్లిని వేడుకుంటూ సీఎం కిరణ్‌ నిర్వేదం
హైదరాబాద్‌, నవంబర్‌1 (జనంసాక్షి) :
రాష్ట్ర అవరతరణ వేడుకలు ఇకపై ఉండవేమోనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్‌ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం కిరణ్‌ మాట్లాడారు. వచ్చే ఏడాది అవతరణ వేడుకలు జరుగుతాయా లేదా అనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు. ఏటా రాష్ట్ర అవతరణ వేడుకలు జరగాలని తెలుగు తల్లిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటులో ఇందిరాగాంధీ ప్రసంగాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. విశాలాంధ్ర నినాదం తన చెవుల్లో మార్మోగుతోందని, తాను సమైక్యవాదినని ఇందిర గతంలో పార్లమెంటులో చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు అనిశ్చితిలో ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఆంధప్రదేశ్‌ అవతరణ దినోత్సవం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విశాలాంధ్ర నినాదం తన చెవుల్లో ఇంకా మార్మోగుతోందని  అన్నారు. తెలుగునేల ఒక రాష్ట్రంగా ఉండటం వల్లే నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు నిర్మించుకో గలిగామన్నారు కలసి ఉండడం వల్లనే అభివృద్ది కూడా సాధ్యమని అన్నారు. బలమైన రాష్ట్రం కావడం వల్లనే శాంతిభద్రతలను కాపాడగలిగామన్నారు. సమైక్య రాష్ట్రంలోనే సంపూర్ణ అభివృద్ధి అన్నారు. తెలుగు జాతి ఒక్కటిగా ఉండటం వల్లనే రాజకీయంగా మనకు విలువ ఉందని చెప్పారు. పూర్వీకులు మనకు అందించిన సంస్కృతి, సంప్రదాయాలు తదితరాలను మనం మన ముందు తరాలకు అందించాలని, అది మన కనీస కర్తవ్యమన్నారు. తెలుగు మాట్లాడే వారందరి కోసం శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, బూర్గుల రామకృష్ణరావు పదవీ త్యాగం చేశారని అన్నారు. తెలుగు వారు ఉన్నత శిఖరాలకు ఎదిగి భారత దేశానికి దశ దిశ చూపిన సంజీవ రెడ్డి, పివి నరసింహారావు వంటి వారికి జోహార్లు అన్నారు. బలమైన రాష్ట్రం వల్లనే శాంతిభద్రతలు, సుస్థిరత అన్నారు. అందరం ఒక్కటిగా ఉండటం వల్లనే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ వంటి ప్రాజెక్టులు కట్టామన్నారు. రాజకీయ విజ్ఞత ఉన్నత వారిని ఎన్నుకోవాలన్నారు. కులం, మతం, ప్రాంతం అనే బేధం లేకుండా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తుందన్నారు.అన్నదాతలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకు ముందు సీఎం జాతీయ జెండాను ఎగురవేసి సాయుధ బలగాల నుంచి వందనం స్వీకరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు తెలుగుతల్లి, భారతమాతను కీర్తిస్తూ… చేసిన నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి. వందమందికి పైగా పోలీసు, పరిపాలన శాఖలకు చెందిన అధికారులకు ముఖ్యమంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, డీజీపీ ప్రసాదరావు, మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, టీజీ వెంకటేష్‌, దానం నాగేందర్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *