ఏపీ భవన్ మాదే.. నిజాం ఆస్తులన్నీ తెలంగాణావే
371-డీ రెండు రాష్ట్రాల్లో అమలు చేయండి
జీవోఎంకు తెరాస లేఖ
హైదరాబాద్, నవంబర్ 3 (జనంసాక్షి) :
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ తెలంగాణదేనని, 1956కు ముందు నిజాం నిర్మించిన భవనాలు, ఆస్తులన్నీ తెలంగాణకే దక్కాలని టీఆర్‌ఎస్ డిమాం డ్ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖ మేరకు తెలంగాణ ఏర్పాటుపై మంత్రుల బృందానికి ఆ పార్టీ ఆదివారం లేఖ రాసింది. సంపూర్ణ తెలంగాణ కావాలని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగిరం చేయాలని, విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి మూడేళ్లపాటు మాత్రమే హైదరాబాద్‌ను రాజధానిగా ఉంచాలని, హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని జీవోఎంను కోరామని టీఆర్‌ఎస్ జాతీయ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం)కు తమ పార్టీ తరఫున నివేదిక అందజేశామని తెలిపారు. విభజన అనంతరం శాసనమండలిని కొనసాగిం చాలని అందులో పేర్కొన్నామన్నారు. సంపూర్ణ తెలంగాణ కావాలని కోరామని, కృష్ణా, గోదావరి నదులపై రెండు కొత్త ప్రాజెక్టులు నిర్మించేందుకు అనుమతి మంజూరు చేయాలని కూడా కోరామన్నారు. విభజన అనంతరం 4వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సహకరిం చాలని కేంద్రాన్ని అడిగాం. చట్టబద్దంగా తెలంగా ణకు రావాల్సిన వాటన్నింటిని కేటాయించాలని కోరామన్నారు. మరో 1500 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్రం ఇవ్వాలని నివేదికలో కోరామని చెప్పారు. రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులను వెంటనే ఏర్పాటు చేయాలి. 371 (డి)ని కొనసాగించాలి. సాధ్యమైనంత త్వరగా ఆంధ్ర రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. తెలంగాణకు ఒక గిరిజన వర్శిటీ కావాలి. బీబీనగర్ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చాలి అని జీవోఎంను కోరినట్టు వెల్లడించారు. ట్రిబ్యునల్ నిబంధనల మేరకు నీటిని కేటాయించాలి. సింగరేణిని తెలంగాణకే కేటాయించాలని డిమాండు చేశామని అన్నారు. 1956కన్నా ముందు ఉన్న స్థిర, చర ఆస్తులన్నీ తెలంగాణకే చెందాలని డిమాండు చేసినట్టు తెలిపారు. మంజూరైన రైల్వే లైన్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి అని కోరామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, త్వరలో ప్రారంభం కానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల మొదటి వారంలోనే తెలంగాణపై బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండు చేశారు. నీళ్లు, నిధులు, అభివృద్ధిలో తెలంగాణ వెనుకబడి పోయిందన్నారు. తెలంగాణ సమస్యలపై సమగ్రంగా నివేదిక ఇచ్చాం. చట్టబద్దంగా తెలంగాణకు రావాల్సిన వాటిని డిమాండు చేశామని ఈటెల అన్నారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మాట్లాడుతూ, ఒప్పందాలను తుంగలో తొక్కి ఉద్యోగులను దోచుకున్న తీరును నివేదికలో పేర్కొన్నామని స్వామిగౌడ్ అన్నారు. వనరుల దోపిడీ ద్వారా తెలంగాణ 4.1 లక్షల కోట్ల రూపాయలను నష్టపోయిందని అన్నారు. వాటిని పరిహరంగా ఇప్పించాలని కోరినట్టు తెలిపారు. ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నప్పటికీ తెలంగాణ సివిల్ సర్వేంట్లను కొత్త రాష్ట్రానికి వచ్చేటట్టు చూడాలని కోరామని అన్నారు. ఇదిలా ఉండగా ఈ సమావేశంలో
పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏకే గోయల్, తదితరులు మాట్లాడారు.