
హైదరాబాద్,నవంబర్ 4 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం మంగళ వారం ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనా రాయణ తెలిపారు. బొత్స సత్యనారాయణతో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతల భేటీ సోమవారం ముగిసింది. మంత్రుల నివాసంలో జరిగిన ఈ భేటీలో మంత్రుల బృందానికి సమర్పించాల్సిన నివేదికపై చర్చించారు. మంగళవాం లోగా నివేదిక సమర్పించాల్సి ఉంది. 11 విధివిధానాలపై జీవోఎంకు అభిప్రాయాలు చెబుతూ నివేదిక సిద్ధం చేయాలని నేతలకు బొత్స సూచించారు. తెలంగాణ నేతలు ఇచ్చిన నివేదికను జీవోఎంకు పంపిస్తామని బొత్స వారితో చెప్పారు. అయితే సీఎం, సీమాంధ్ర నేతలతో సమావేశమైన తర్వాత పూర్తి వివరాలు చెబుతానన్నారు. సాయంత్రం తాను, సీఎం, కలిసి సీమాంధ్ర నేతల అభిప్రాయాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. ప్రాంతాలవారీగా వేర్వేరు సమావేశాలు ఎలా ఏర్పాటు చేస్తారన్న తెలంగాణ నేతలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇరు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు గౌరవిస్తున్నందునే వేర్వేరుగా భేటీలు నిర్వహించినట్లు బొత్స తెలిపారు. జీవోఎంకు పార్టీ తరఫున ఒకే నివేదిక పంపాలని నేతలు బొత్సను కోరారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలతో సీమాంధ్ర సమస్యల పైనే చర్చించాలని, అలా కాకుండా మళ్లీ సమైక్యాంధ్ర అంటే కుదరదని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు బొత్సకు సూచించారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఆ వెంటనే తెలంగాణ నేతలు డెప్యూటీ సీఎం దామోదర రాజనరసింహతో సమావేశమై చర్చిస్తున్నారు. 11 అంశాలపై నివేదిక తయారు చేస్తున్నారు.
నిర్ణయం మంత్రుల బృందానికి నివేదిస్తాం : బొత్స




