Tuesday, 3 November 2026

ఒకే నివేదికివ్వండి సీడబ్ల్యూసీ నిర్ణయమైపోయింది


ఇరుప్రాంతాలు అభివృద్ధికి తోడ్పడండి : జానారెడ్డి
హైదరాబాద్‌, నవంబర్‌ 4 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మంత్రుల బృందానికి ఒకే నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణను కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిడబ్ల్యూసి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున వాటిని గౌరవిస్తూనే ఒకే అభిప్రాయాన్ని నివేదిక రూపంలో జిఓఎంకు ఇవ్వాలని బొత్స సత్యనారాయణను కోరినట్లు జానారెడ్డి తెలిపారు. బొత్సతో సమావేశం, ఆ తర్వాత డెప్యూటీ సీఎం ఇంట్లో నివేదికపై సమావేశం అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకిస్తున్నట్లు అభిప్రాయాన్ని ఏ ఒక్కరు వ్యక్తం చేసేలా ఉండకూడదని తేల్చి చెప్పామన్నారు. విభజన తర్వాత తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు గాను ఇరు ప్రాంతాల్లో వేలాది కోట్ల రూపాయలను కేటాయించాలనే విధంగా ఉండాలని సూచించామన్నారు. నిధులు, నీళ్లు, రాజధాని నిర్మాణం, ఉమ్మడి రాజధాని, శాంతి భద్రతల సమస్యలు, పౌరుల హక్కులకు భద్రత కల్పించందుకు నివేదిక మార్గదర్శిగా ఉండాలని కోరామన్నారు. రాష్ట్ర విభజన అనేది పార్టీ నిర్ణయం అనే అంశాన్ని మాత్రం మరిచిపోవద్దన్నామన్నారు. తెలంగాణలో కేంద్రం అడిగిన 11 అంశాలపైన సమగ్ర నివేదికను రూపొందించేందుకు నలుగురైదుగురు కూర్చుని తయారు చేస్తారన్నారు. మంగళవారం మధ్యాహ్నం లోగా ఆనివేదికను బొత్సకు అందించడమేకాక జిఓఎంకు కూడా పంపిస్తామన్నారు. ఒక్కో అంశంపై సలహాలు,సూచనలు, ఆర్థిక సహాయం, కేంద్రం ఇవ్వాల్సిన సహాయం కార్యక్రమాలను కోరనున్నామన్నారు. రాష్ట్రపతిని కూడా తాము కలువాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే తాము తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గూర్చి వివరిస్తామని, అంతేకాని రాజ్యాంగాన్ని అందులో లోపాలను చూపిస్తూ ఇలా చేయాల అలాచేయాలనే అంశాలను సూచించబోమన్నారు. రాజ్యాంగ బద్దంగా ఆయన చేయాల్సిన పనులన్నింటిని చేసుకునే స్వేచ్చను ఇస్తామన్నారు. మీడియా సమావేశంలో డెప్యూటీ సిఎం రాజనర్సింహ, మంత్రులు సారయ్య, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *