
కిరికిరి లేకుండా ఇస్తే విలీనం ఆలోచిస్తాం : కేసీఆర్
సిద్దిపేట, నవంబర్ 4 (జనంసాక్షి) :
‘తెలంగాణ పునర్నిర్మాణంపై మాకుండే ఆలో చనలు, లక్ష్యాలు మాకున్నాయి’ అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కిరికిరి లేకుండా తెలంగాణ ఇస్తే పార్టీ విలీనం గురించి ఆలోచిస్తామన్నారు. పార్టీని విలీనం చేయడం అంత సులభం కాదన్నారు. తాను గతంలోనే ప్రతిపాదించినప్పుడు తెలంగాణ ఇచ్చివుంటే కనీసం మరో నాలుగు వందల ప్రాణాలు దక్కేవన్నారు. ఇప్పటికిప్పుడు పార్టీ విలీనంకన్నా, తెలంగాణ ఏర్పాటయ్యాక పునర్నిర్మాణంలో కీలక భూమిక పోషించాల్సి ఉందన్నారు. మెదక్ జిల్లా నంగునూరు మడలం అక్కంపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కెసిఆర్ ఇక్కడ విలేకరులతో మా ట్లాడారు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా పార్టీ విలీనం ఆషామాషీ వ్యవహారం కాదని, దానికి రాజకీయ పరిస్థితులు కూడా కలిసిరావాలని అన్నారు. ‘మేం టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తాం. తెలంగాణ ఇవ్వండి అని అన్నప్పుడే ఇచ్చి ఉంటే కనీసం నాలుగు వందల మంది తెలంగాణ విద్యార్ధులు బతికేవారు. కాంగ్రెస్ ఉత్తినే తెలంగాణ ఇవ్వలేదు. వెయ్యి మందిని పొట్టన బెట్టుకున్నాకే తెలంగాణ రాష్టాన్ని ఇచ్చింది’ అని వ్యాఖ్యానించారు. గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ పౌరుల గురించి ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నగరంలో చేపట్టిన మెట్రోరైలు ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలున్నాయని దుయ్యబట్టారు. మెట్రో రైలు ప్రాజెక్టుతో అమరవీరుల స్తూపం, అసెంబ్లీ దెబ్బతినే అవకాశముందని అన్నారు. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని కేసీఆర్ విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉండి కేంద్రం నియమించిన మంత్రుల బృందానికి లేఖ ఇవ్వక పోవడం బాధ్యతారాహిత్యమని ధ్వజమెత్తారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు లేఖ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు రైతుల సమావేవంలో మాట్లాడుతూ సిద్దిపేటకు మంజూరైన రైలు మార్గాన్ని సీమాంధ్ర సీఎంలు అడ్డుకున్నారన్నారు. సిద్దిపేటకు మంజూరైన రైలు మార్గాన్ని సీమాంధ్ర సీఎంలు అడ్డుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిరుపేదల కళ్లల్లో ఆనందం చూసేందుకు పనిచేస్తానన్నారు. అన్ని శాఖల్లోని ఒప్పంద ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామన్నారు. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సాధనలో ఓ అంకం పూర్తయిందని అన్నారు. సిద్ధిపేట తనను మనసారా దీవించారని ఎన్ని జన్మలెత్తినా సిద్ధిపేట ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సిద్ధిపేటను జిల్లా కేంద్రంగా చేయలన్నారు. సిద్ధిపేటకు 100 కిలోవిూటర్ల దూరంలో టౌన్‌షిప్ వస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వెళ్లాలన్నా గంటలు గంటల ట్రాఫిక్‌తో గందరగోళం ఉందన్నారు. హైదరాబాద్‌ను సీమాంధ్రులు నాశనం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, కెవి రమణాచారి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, కవి నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణపై మా లక్ష్యాలు మాకున్నాయి




