
రాజధానిపై కేంద్ర పెత్తనం సహించం
ఉమ్మడికి అంగీకరించం
రాయల తెలంగాణ మా వైఖరి
అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్, నవంబర్ 6 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ను లూటీ చేసేందుకే కేంద్ర పాలితప్రాంతంగా చేయాలని సీమాంధ్ర నేతలు కోరుతున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి రాసిన లేఖ వివరాలను బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధాని అని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానికి తాము వ్యతిరేకమని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రుల బృందానికి 46 పేజీల నివేదిక పంపామని వివరించారు. హైదరాబాద్‌పై కేంద్రంపెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. రాయలతెలంగాణ తమ పార్టీ వైఖరి అని చెప్పారు. అనంతపురం, కర్నూలును తెలంగాణలో కలిపితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఆ రెండు జిల్లాలను విస్మరిస్తే నీటి యుద్ధాలు తప్పకుండా తలెత్తుతాయని అన్నారు. హైదరాబాద్ యూటీ ప్రతిపాదనకు తాము వ్యతిరేకమన్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి అధికారాలు కేంద్రానికి ఉండకూడదని తెగేసి చెప్పారు. కేబినెట్ నోట్‌లో హైదరాబాద్‌పై స్పష్టత లేదన్నారు. కేబినెట్ నోట్‌పై తమకెన్నో అనుమానాలున్నాయని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే ఆర్‌ఎస్‌ఎస్ మరింత విస్తరిస్తుందని, సంఘ్‌పరివార్ మరింత బలపడే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రులు కేవలం హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్నారు. అన్ని ప్రాంతాలను యూటీ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కొందరు తమ ఆస్తుల రక్షణ కోసమే యూటీ ప్రతిపాదన తెస్తున్నారని అన్నారు. విభజన వల్ల రాయలసీమకు అధికంగా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. విభజన జరిగిన వెంటనే ఇరు ప్రాంతాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ముమ్మాటికీ తెలంగాణదేనని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లూటీకే యూటీ




