
అసెంబ్లీకి తీర్మానం రాదు.. బిల్లు మాత్రమే : బొత్స
హైదరాబాద్, నవంబర్ 6 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తనకున్న అవగాహన ప్రకారం అసెంబ్లీకి తెలంగాణ బిల్లు మాత్రమే వస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ అంశంపై తీర్మానం కూడా రావాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా సీడబ్ల్యూసీ తీర్మానాన్ని అంగీకరిస్తున్నానని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఈ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నానని పేర్కొన్నారు. రెండు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. విభజనపై కాంగ్రెస్‌కు స్పష్టత ఉందని చెప్పారు. విభజనపై కొన్ని పార్టీలు యూటర్న్ తీసుకోవడం సరికాదన్నారు. తెలంగాణ అంశంపై తీర్మానం కూడా కావాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా సీడబ్ల్యూసీ తీర్మానాన్ని అంగీకరిస్తున్నానని, తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నానని బొత్స సత్యనారాయణ అన్నారు. పాలెం బస్సు ప్రమాద ఘటనలో యజమానులైన దివాకర్ రోడ్‌లైన్స్‌పై కేసు నమోదు చేశామని బొత్స తెలిపారు. దూర ప్రాంతాలకు కొత్త ఆర్టీసీ బస్సులు నడుపుతామని బొత్స సత్యనారాయణ తెలిపారు. పాలెం బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి ఎక్స్‌గ్రేషియా నిర్ణయించలేదని చెప్పారు. ఇప్పటి వరకు 601 బస్సులపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇదిలావుంటే బొత్స సత్యనారాయణ గురువారం హస్తిన వెళ్లనున్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో బొత్స, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొననున్నట్లు సమాచారం. సీఎం కిరణ్‌కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీఎం కూడా శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు.
సీడబ్ల్యూసీ నిర్ణయం శిరసావహిస్తా




