Tuesday, 3 November 2026

ఛత్తీస్‌గఢ్‌ను సర్వనాశనం చేశారు


పేదరికాన్ని వృద్ధి చేశారు
అధికారమిస్తే చేతల్లో చూపిస్తాం : సోనియా
రాయ్‌పూర్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి) :
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందని, పేదరికాన్ని ఎంతో వృద్ధిలోకి తెచ్చిందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. సరైన ప్రభుత్వం లేక రాష్ట్రంలో పేదరికం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నక్సలిజం వల్ల కాంగ్రెస్‌ పార్టీ ఎంతో మంది నాయకులను కోల్పోయిందని.. బీజేపీ పాలనలో గిరిజనులకు భద్రత లేదని తెలిపారు. గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సోనియా ప్రసంగిస్తూ బీజేపీని తూర్పారబట్టారు. బీజేపీ నేతలవి కేవలం మాటలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ కొందరి కోసమైతే.. తాము అందరి కోసం పని చేస్తున్నామని.. ప్రజలందరినీ సమానంగా చూస్తున్నామని తెలిపారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న హావిూలను చూసి వలలో పడొద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశం కోసం త్యాగాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రమణ్‌సింగ్‌ ప్రభుత్వంలో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉందని విమర్శించారు. గత మే నెలలో జరిగిన మావోయిస్టుల దాడిలో 25 మంది కాంగ్రెస్‌ నాయకులను కోల్పోయామన్నారు. యూపీఏ హయాంలో పేదలకు ఎంతో మేలు చేశామని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేయడం వల్లే ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. పేదల కోసం ఆహార భద్రత చట్టం, అటవీ చట్టం తీసుకొచ్చామని, రైతులకు మద్దతు ధర కల్పించామని చెప్పారు. తమకు అధికారమిస్తే అభివృద్ధి అంటే చేతల్లో చూపిస్తామని తెలిపారు. ప్రజల సర్వతోముఖాభివృద్ధే కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *