
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్
రాయ్‌పూర్, నవంబర్ 8 (జనంసాక్షి) :
అవినీతిలో భారతీయ జనతా పార్టీ ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. బీజేపీపై, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌పై ఆయన నిప్పులు చెరిగారు. రమణ్‌సింగ్ ప్రభుత్వం అవినీతిలో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా బీజేపీలో ఏలుబడిలో ఉన్న రాష్ట్రం సాధించిన ప్రగతి మాత్రం శూన్యమని విమర్శించారు. కొంత మంది వ్యక్తులను నమ్ముకొని అధికారంలోకి రావాలని చూస్తోందని పరోక్షంగా మోడీని ఉద్దేశించి మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. దేశంలో అవినీతిని అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆర్టీఐ అనే శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చిందన్నారు. ఉపాధి కోసం అనేక మంది ప్రజల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వస్తున్నారని తెలిపారు. ప్రజలతోనే అధికారం సాధ్యమని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. కానీ ముఖ్యమంత్రుల వల్లే అధికారం సాధ్యమని బీజేపీ ప్రగాఢంగా నమ్ముతోందని మోడీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మే 25న జరిగిన దాడిలో కాంగ్రెస్ ముఖ్య నేతలంతా దుర్మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మే నెలలో జరిగిన మావోల దాడిలో కాంగ్రెస్ నేతలు మృతి చెందారని గుర్తు చేసిన రాహుల్.. పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్ బతికి ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యే వారని తెలిపారు. ‘పటేల్ బతికి ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆయనను ఎవరూ ఆపేవారు కాదు. ఆయనను అడ్డుకోవడం ఎవరివల్లా కాదు. అందుకే ఆయనను లేకుండా చేశారు’ అని అన్నారు. ‘ఇది కేవలం కాంగ్రెస్ పార్టీపై జరిగిన దాడి కాదు.. ప్రజలపై జరిగిన దాడి’ అని వ్యాఖ్యానించారు. హింస, దాడి కేవలం కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకొని జరగలేదని.. ప్రజలు, మహిళల గొంతు నొక్కేందుకే ఈ మారణ కాండ అని తెలిపారు. ఈ ఘటనను ఓటర్లు మరిచిపోవద్దని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
అవినీతిలో భాజపా ప్రపంచ చాంపియన్




