Tuesday, 3 November 2026

జీవోఎంకు బలంగా ఆకాంక్ష విన్పిస్తాం


హైదరాబాద్‌పై కొర్రీలు సహించం : కోదండరామ్‌
హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి బలంగా వినిపిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సోమవారం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో టీ జేఏసీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌పై ఎలాంటి కొర్రీలు సహించబోమని ఆయన పేర్కొన్నారు. మంత్రుల బృందాన్ని కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష బలంగా చాటుతామని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంటే, తెలంగాణ ఆకాంక్ష ఆరు దశాబ్దాలదని ఆయన తెలిపారు. యూపీఏ ప్రభుత్వం సిద్ధం చేసిన నోట్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం మేరకు హైదరాబాద్‌, పదిజిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. ఇది కాకుండా తెలంగాణ ప్రజలకు మరేది సమ్మతం కాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ దారుణమైన నివేదిక ఇచ్చిందని, రాజ్యాంగాన్ని అవహేళన చేసేట్టుగా కమిటీ నివేదిక ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌ పాలన, ఆస్తులు ఇతర అంశాల్లో కేంద్రం జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. అలాగే భద్రాచలం డివిజన్‌ తెలంగాణలో అంతర్భాగమని ఆయన తెలిపారు. హైదరాబాద్‌పై ఆంక్షలు ఒప్పుకోబోమని, భద్రాచలం డివిజనూ విడిచిపెట్టమని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *