వేగం పెంచిన జీవోఎం
ముగిసిన అఖిలపక్షం
నేడు మంత్రుల బృందం ముందుకు సీఎం కిరణ్
సీపీఎం, వైఎస్సార్సీపీ పాత పాటే..
సీఎంకు జీవోఎం నుంచి పిలుపు
న్యూఢిల్లీ, నవంబర్ 13 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు విధివిధానాలు సిద్ధం చేయడం, ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కీలకంగా ఉన్న 11 అంశాలపై అభిప్రాయాలు సేకరించడం, విభజనకు సంబంధించిన నివేదిక రెడీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం తలమునకలైంది. డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటం, అంతకుముందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం కోసం బిల్లు పంపాల్సి ఉండటంతో విభజన ప్రక్రియ త్వరగా కొలిక్కి తేవాలని ఇప్పటికే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించడంతో మంత్రుల బృందం తన పని త్వరగా ముగించడానికి వేగం పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపుపొందిన ఎనిమిది పార్టీల అభిప్రాయం కోసం లేఖలు రాయగా టీడీపీ మినహా మిగతా ఏడు పార్టీలు జీవోఎం ఎదుట హాజరయ్యాయి. బుధవారం సీపీఎం, వైఎస్సార్సీపీ ప్రతినిధులు జీవోఎంకు తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ రెండు పార్టీలు యథావిధిగా పాతపాటే పాడాయి. మరోవైపు తమ ఎదుట హాజరుకావాలని కోరుతూ జీవోఎం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరింది.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి మంత్రుల బృందం నుంచి ఆహ్వానం అందింది. గురువారం రాత్రి 8గంటలకు సీఎం మంత్రుల బృందంతో భేటీ కానున్నారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో సంప్రదించిన జివోఎం మరోమారు సిఎంతో చర్చిచే అవకాశాలు ఉన్నాయి. విభజన నిర్ణయం నేపథ్యంలో తమ ఎదుట హాజరు కావాలని జీవోఎం సూచించింది. ఇప్పటికే అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న జివోఎం తాజాగా కిరణ్ అభిప్రాయాన్ని తీసుకోనుంది. గురువారం సాయంత్రం జీవోఎం సభ్యులు భేటీ కానున్నారు. అయితే ఈ భేటీకి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంఐఎం, బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్, సీపీఐ, టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ, సీపీఎం పార్టీలో మంత్రలు బృందం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా అన్ని పార్టీలు తమ వాదనలు వినిపించాయి. మరోవైపు విభజనకు సంబంధించి ఎలాంటి విధివిధానాలు చెప్పకుండా, తమవద్ద ఉన్న ప్రతిపాదనలేమిటో వివరించకుండా, విభ జనతో ముడిపడిన అనేకాంశాల వివరాలు, వివరణలేవీ లేకుండా మంత్రుల బృందం మొక్కుబడిగా పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. దీంతో జీవోఎం భేటీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రుల నుంచి మౌనమే సమాధానమయింది. ఇదిలావుంటే ముఖ్యమంత్రి ఢిల్లీ పిలుపు కారణంగా విశాఖలో ఆయన పాల్గొనే రచ్చబండ రద్దయ్యింది. ఇది మళ్లీ ఎప్పుడు జరిగేది తెలియదు.
నాన్చి నాశనం చేశారు
భాష ప్రయుక్త రాష్ట్రాలకే కట్టుబడ్డాం : రాఘవులు
తెలంగాణ అంశాన్ని నాన్చి రాష్ట్రాన్ని నాశ నం చేశారని సీపీఎం నేత రాఘవులు అ న్నారు. భాష ప్ర యు క్త రాష్ట్రాలకే కట్టు బడి ఉన్నామని ఆ యన పేర్కొన్నారు. జీవోఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మంత్రుల బృందాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. సీపీఎం పార్టీ తరపున రాఘవులు, జూలకంటి రంగారెడ్డి జీవోఎంతో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి, సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేసినట్లు వివరించారు. నాలుగేళ్లుగా సమస్యను నానబెట్టడంతో రాష్ట్రంలో అభివృద్ధి కుటుంపడిందన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదన్నారు. అనంతపురం, కడప, కర్నూలు, నల్గొండ, ప్రకాశం జిల్లాలకు నీటిపారుదల సదుపాయాన్ని మెరుగు పర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని సూచించినట్లు వివరించారు. తెలంగాణ ప్రాంతంలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయాలని, ఉత్తరాంధ్రలో రూ.వెయ్యి కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మిస్తే పుష్కలంగా నీరందించవచ్చని జీవోఎంకు వివరించినట్లు రాఘవులు చెప్పారు. వెనకబడిన ప్రాంతాలు ఎక్కడన్నా అభివృద్ధి చేయాలన్నారు.
విభజన అనంతర సమస్యలు పరిష్కరించలేరు
అందుకే సమైక్యంగా ఉంచండి : మైసూరారెడ్డి
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఉత్పన్న మ య్యే సమస్యలు పరిష్క రించలేరని, అందుకే సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. జీవోఎంతో భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవటం లేదనిఆయన అన్నారు. తొలి నుంచి సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న వైఎస్ఆర్ సీపీ విభజనకు వ్యతిరేకంగా తన వాదన వినిపించింది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఎదురయ్యే సమస్యలను జీవోఎం దృష్టికి తీసుకువెళ్లింది. వైఎస్ఆర్ సిపి తరపున మైసురారెడ్డి, గట్టు రామచంద్రరావు జీవోఎంతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. భేటీ అనంతరం మైసూరారెడ్డి విూడియాతో మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్టాల్రను విడదీసేటప్పుడు చేయాల్సిన ఆలోచనలు చేయటం లేదన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో విభజన వాదాలు ఉన్నాయని అయితే వాటి గురించి ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఆంధప్రదేశ్‌ను మాత్రమే ఎందుకు విడదీయాలనుకుంటున్నారన్నారు. రాష్ట్రాల విభజనపై ఓ కమిషన్ లేదా కమిటీ వేసి విభజనపై నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని మైసూరారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్నవారిని ఒక్కసారే వెళ్లిపోమంటే ఎంత బాధపడతారో ఆలోచించాలని ఆయన అన్నారు. ఇదిలావుంటే జీవోఎం మరోమారు ఈ నెల 20న భేటీ కానుంది. వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.