
తెలంగాణపై ఆమె నిర్ణయంలో తిరుగులేదు : జైపాల్‌రెడ్డి
నిర్మల్, నవంబర్ 13 (జనంసాక్షి) :
సోనియాగాంధీది వజ్రసంకల్పమని ఆమె తెలం గాణపై తీసుకున్న నిర్ణయంలో తిరుగుండబోదని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో నిర్వహించిన కాంగ్రెసు పార్టీ కృతజ్ఞత సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తీరుతుందన్నారు. జనవరి కల్లా కొత్త రాష్ట్రం ఆవిర్భవిస్తుందని చెప్పారు. శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్, మంత్రి డికె అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్ తదితరులు మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎవరినీ సంప్రదించకుండా కేంద్రానికి ప్రభుత్వం తరఫున నివేదిక పంపించడం సరికాదని డిఎస్ అన్నారు. ఆయన నివేదికను ఎవరూ పట్టించుకోరన్నారు. కిరణ్ అయినా మరెవరైనా సిడబ్ల్యూసి నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని చెప్పారు. సామాజిక తెలంగాణ వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. తెలంగాణ వచ్చాక పదేళ్లలో రాష్ట్రాన్ని దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా చేద్దామన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసే నాయకత్వం మనకు ఉందన్నారు. పార్టీలను నివేదిక ఇవ్వాలని జివోఎం కోరిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన 30 జూలైన చేసింది కాదని, డిసెంబర్ 9, 2009న తీసుకున్న నిర్ణయమేనని అన్నారు. నాడు పలువురు విభజనకు అడ్డుపడ్డారని విమర్శించారు. తెలంగాణపై మూడు నెలల క్రితమే కొత్తగా ప్రకటన చేయలేదన్నారు. నాడు పార్లమెంటులోనే ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎవరి ప్రమేయం లేదని, సోనియా గాంధీ మాత్రమే ఇచ్చారని డీఎస్ తెరాసను ఉద్దేశించి చెప్పారు. తెలంగాణ మంత్రుల అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక ఎలా పంపుతారని మంత్రి డికె అరుణ ప్రశ్నించారు. వచ్చేది సామాజిక తెలంగాణ అని, బహుజనులకు న్యాయం జరుగుతుందన్నారు. పొత్తుల పైన తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. అఖిల పక్షాన్ని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ జివోఎం భేటీకి ఎందుకు వెళ్లలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. టిడిపి తెలంగాణకు అనుకూలమైతే జివోఎంకు వెళ్లాల్సి ఉండెనన్నారు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు కూడా రావన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జైత్రయాత్రలు కాదు ఇతర పార్టీలపై దండయాత్రలు చేస్తామని రాష్ట్రమంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది మేమేనని ఆయన అన్నారు. గతంలో బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఏం చేసిందని పార్టీలో ఉంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఆదిలాబాద్ జిల్లాను కొమురంభీం జిల్లాగా మారుస్తామని రాష్ట్రమంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు అండగా నిలవలన్నారు. అప్పుడే కృతజ్ఞతా సభకు అర్థం ఉంటుదన్నారు. తెలంగాణలో రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీని పెట్టనివ్వమని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ మంత్రుల అభిప్రాయాలు తీసుకోకుండా ఆయన తప్పుడు నివేదికలు పంపించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు.
సోనియాది వజ్రసంకల్పం




