Wednesday, 4 November 2026

కేబినెట్‌ తీర్మానం లేకుండా నివేదికెలా పంపావ్‌

సీఎస్‌పై జానా ఫైర్‌
హైదరాబాద్‌, నవంబర్‌ 14 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ విభజనపై కేబినెట్‌ తీర్మానం లేకుండా నివేదికెలా పంపావంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిపై మంత్రి జానారెడ్డి ఫైరయ్యారు. కేబినెట్‌లో చర్చించకుండా రాష్ట్రవిభజనపై ముఖ్యమంత్రి ఏకపక్షంగా నివేదికను పంపించి ఇదే ప్రభుత్వ నివేదికని జిఓఎంను మోసం చేసినందున దానిని పరిగణనలోకి తీసుకోవద్దని జానారెడ్డి జిఓఎంను కోరారు. గాంధీభవన్‌లో జరిగిన నెహ్రూ జయంతి వేడుకల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంకా కూడా ఒంటెత్తు పోకడలతోనే ముందుకు వెల్లడం దుర్మార్గమన్నారు. ఆయన చెపుతున్నట్లుగా నదులు 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్నప్పుడు ఎలా విభజించడం సాధ్యం అవుతుందడం అవివేకానికి నిదర్శనమన్నారు. ఆంధ్రా గతంలో హైదరాబాద్‌లో విలీనానికి ముందు కూడా ఇంతే దూరం ఉందని, ఇప్పుడు అంతేనన్నారు. దీనిలో ఏమార్పు రాలేదని గుర్తు చేశారు. తలా తోకలేని వాదనలు తీసుకువచ్చి ప్రజలను మభ్యపెట్టడం రాజకీయ అజ్ఞాని చేసే ప్రకటనలే అవుతాయన్నారు. రాష్ట్రప్రభుత్వం పక్షాన కేంద్రంలోని జిఓఎంకు పంపించిన నివేదికను ఒంటరిగా పంపించి ప్రభుత్వ నివేదిక అంటే తాము ఎలా అంగీకరిస్తామన్నారు. దీనిని తీసి పారెయ్యాలని ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్ర విభజన కార్యక్రమం వేగంగా సాగుతున్న సమయంలో గందర గోళ వాతావరణాన్ని సీమాంధ్రులు ప్రయత్నించవద్దన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా పరస్పర సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. కుటుంబాన్ని విభజించే సమయంలో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న చర్చలను, వాదనలను ఘర్షణలుగాను, పోరాటాలుగా తామైతే భావించ డంలేదన్నారు. ఇంతకాలం ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాని విడగొట్టాలని పట్టుబట్టిన వైసిపి, 2008 లేఖకే కట్టుబడి ఉన్నా తెలంగాణ సమస్యను సత్వరమే పరిష్కరించాలన్న టిడిపి వైఖరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని జానారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల ఆకాంక్షమేరకే రాష్ట్ర విభజనను కాంగ్రెస్‌ హైకమాండ్‌ చేపట్టిందన్నారు. దీనిని రాద్దాంతం చేయవద్దన్నారు. విభజన ముమ్మాటికి జరిగి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రిని మార్చుతున్నారనే అంశంపై తెలంగాణవాదులకు పెద్దగా ఆసక్తి లేదన్నారు. ఎవ్వరు సిఎంగా ఉన్నాకూడా అధిష్టానం చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనన్నారు. ఈనెల 17న వికారాబాద్‌, 24న కరీంనగర్‌, 20న మెదక్‌లలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ జైత్రయత్రలను వాయిదా వేస్తున్న ట్లు మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. ఈతేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. చాలా మంది నేతలు డిల్లీలో పర్యటించి అధిష్టానం నేతలను, జిఓఎంకు అందుబాటులో ఉండాల్సిన  అవసరం ఉన్నందునే కార్యక్రమాలను వాయిదా వేస్తున్నామన్నారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర విభజనను ఏఒక్కరు కూడా ఆపలేరని జానారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈతరుణంలో సీమాంధ్రకు చెందిన అన్ని పార్టీలు కూడా సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *